వైసీపీ దళిత నేతలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. నంది కొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ లో చేరారు. వారు ఆ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మరో దళిత నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా కాంగ్రెస్లో చేరనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
గుంటూరు వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహిస్తున్న మాజీ మంత్రి డొక్కా మానిక్యవరప్రసాద్కు ఆ పార్టీలో గుర్తింపు లేదు. కనీసం ఎవరూ ప్రచారానికి కూడా పిలవడం లేదు. కొద్ది రోజుల కిందట జరిగిన సామాజిక బస్సు యాత్రలో పార్టీలో తన పరిస్థితిపై తానే బాధపడ్డారు. తనకు న్యాయం జరగడం లేదని.. ఒక్క సారి జగన్ను కలిపించాలని ఆయన వేదికపై ఉన్న నేతల్ని వేడుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయనను మరింతగా దూరం పెట్టారు.
కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆయనకు చంద్రబాబు గౌరవం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చారు. టిక్కెట్ ఇచ్చారు. పార్టీ వేదికలపై ఆయనకు మంచి గౌరవం లభించేది. అయితే మూడు రాజధానుల నాటకం సమయంలో .. డొక్కా కూడా తాను కన్నింగ్ పొలిటీషియన్నేనని నిరూపించారు. రాజధాని మార్పునకు వ్యతిరేకంగా రాజీనామా అంటూ నాటకమాడి వైసీపీలో చేరిపోయి.. తాను రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికి మళ్లీ ఎన్నికయ్యారు.
ఆయనను ఇప్పుడు టీడీపీలోకి కూడా ఎవరూ ఆహ్వానించడం లేదు. కాంగ్రెస్ లో విలువ లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు చూసుకుంటున్నారు. షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి.