మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చేప్పేయాలనుకొన్నప్పుడు, ఆయన మొదట వైకాపాలో చేరాలనుకొన్నారు. అందుకు అంబటి రాంబాబు మధ్యవర్తిత్వం వహించారు. కానీ చివరి నిమిషంలో తన రాజకీయ గురువు, శ్రేయోభిలాషి అయిన ఎంపి రాయపాటి సలహా మేరకు తెదేపాలో చేరిపోయారు. అందుకు ఆయన రాంబాబుకి, జగన్మోహన్ రెడ్డికి మీడియా ద్వారా క్షమాపణలు కూడా చెప్పుకొన్నారు. ఒకవేళ అప్పుడు ఆయన వైకాపాలో చేరి ఉండి ఉంటే, నేడు తెదేపా ప్రభుత్వాన్ని దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుండేవారని వేరేగా చెప్పనవసరం లేదు. కానీ తెదేపాలో చేరారు…దాని అధికార ప్రతినిధిగా కూడా నియమింపబడ్డారు కనుక ఇప్పుడు ఆయన వైకాపాని, జగన్మోహన్ రెడ్డిని విమర్శించవలసిరావడమే చాల విచిత్రంగా ఉంది. ఇప్పటి రాజకీయ నేతలెవరికీ నిర్దిష్టమయిన ఆశయాలు, సిద్దాంతాలు ఏవీ లేనందునే అవకాశాన్ని బట్టి ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరిపోయి ఇటువంటి ఇబ్బందికరమయిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చును.
ఇంక విషయంలోకి వస్తే ఇవ్వాళ్ళ ఆయన జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసారు. జగన్ స్వంత మీడియా సాక్షిలో అర్ధంపర్ధం లేని నిరాధారమయిన కట్టుకధనాలను ప్రచురించేసి, వాటి ఆధారంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలలో చర్చకు పట్టుబట్టి, జగన్మోహన్ రెడ్డి సభా సమయం అంతా వృధా చేసారని విమర్శించారు. తను ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయిన ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ఆలోచించడం ఆయనకే చెల్లు, అని విమర్శించారు. రాష్ట్రం గురించి, ప్రజల గురించి అంతగా ఆవేదనపడిపోతున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం ఏమీ చేయకపోయినా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని విమర్శించారు.
మాణిక్య వరప్రసాద్ జగన్ పై మరొక ఆసక్తికరమయిన విమర్శ కూడా చేసారు. జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే, తెదేపా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని పదేపదే గట్టిగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది మంత్రులు కూడా శాసనసభలో జగన్ సిబీఐ కేసుల గురించి, వారం వారం ఆయన కోర్టుకి వెళ్లి వస్తుండటం గురించి ప్రస్తావించకుండా ఉండరు. అది జగన్ బలహీనత మీద దెబ్బ కొట్టే ప్రయత్నమేనని చెప్పవచ్చును. కనుకనే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతీ అంశంలోనూ తెదేపా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విమర్శిస్తున్నారని డొక్కా వారి అభిప్రాయంగా కనబడుతోంది.
జగన్మోహన్ రెడ్డిపై సిబీఐ కేసులున్న మాట నిజం. ఆయన కోర్టుకి వెళ్లి వస్తుండటం కూడా నిజమే. అయన కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. అతను అవినీతిపరుడో కాడో న్యాయస్థానం తేలుస్తుంది. ఒకవేళ అతను నిజంగా అవినీతిపరుడే అయినప్పటికీ, అవినీతిపై ఆయన సంధిస్తున్న ప్రశ్నలకు తెదేపా నేరుగా సంతృప్తికరమయిన జవాబులు చెప్పగలిగి ఉంటే, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వంపై నిరాధారమయిన ఆరోపణలు చేస్తునందుకు అందరూ అప్పుడు ఆయననే తప్పు పట్టి ఉండేవారు. కానీ ఆవిధంగా చేయకుండా జగన్ తన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే ప్రభుత్వపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని డొక్కావారు వాదించడం అర్ధరహితం. ఒకవేళ ఆయన వైకాపాలో చేరి ఉండి ఉంటే, ఇదే అంశంపై దీనికి పూర్తి భిన్నమయిన వాదన చేస్తుండేవారు కదా?అంటే డొక్కావారి వాదనకు తను పని చేస్తున్న పార్టీకి అనుగుణంగా చేస్తున్నదే తప్ప దానికి బలం లేదని స్పష్టం అవుతోంది.