తిరుమలలో శ్రీవారి ఆలయ వ్యవహాలన్నింటినీ కనుచూపుతో శాసించే డాలర్ శేషాద్రి గుండెపోటుతో కన్నుమూశారు. విశాఖలో టీటీడీ నిర్వహించే కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఆయన వెళ్లారు. అక్కడే ఉదయమే గుండెపోటు రావడంతో సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆయన కన్నుమూశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే… శ్రీవారి తర్వాత అందరికీ గుర్తొచ్చేది డాలర్ శేషాద్రి. తెలియని వాళ్లు చాలా మంది ఆయనే ప్రధాన అర్చకుడని అనుకుంటారు. నిజానికి ఆయన సాదాసీదా ఉద్యోగి మాత్రమే. కానీ.. ఆయన పలుకుపడి రాష్ట్రపతి వరకూ ఉంటుంది.
దశాబ్దాలుగా శ్రీవారి ఆలయంలో ఆయనదే హవా. పార్టీలు, ప్రభుత్వాలతో సంబంధం లేదు.. ఎవరొచ్చినా ఆయన ఉండాల్సిందే. సాధారణ ఉద్యోగిగా టీటీడీలో చేరిన శేషాద్రి 2007లో రిటైర్ అయ్యారు. కానీ ప్రభుత్వాలు ఆయనను ఓఎస్డీగా నియమిస్తూ వచ్చాయి. ఆయనకు పొడిగింపుపై కోర్టు కేసులు నమోదయ్యాయి. ఓ సారి డాలర్ శేషాద్రి నియామకం చెల్లదంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై డాలర్ శేషాద్రి సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ తర్వాత సుప్రీంకోర్టు డాలర్ శేషాద్రికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఆయన టీటీడీలో కొనసాగుతున్నారు. మాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులకు, డాలర్ శేషాద్రి మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు ఉంది.
వైసీపీ ప్రభుత్వంలోనూ ఆయనను తొలగించడానికి ప్రయత్నించారు. రిటైరైపోయి కూడా.. విధుల్లో కొనసాగుతున్న వారిని తక్షణం తీసేయాలంటూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో ఇచ్చింది. దీన్ని టీటీడీకి కూడా అన్వయించింది. ఈ జీవో మేరకు.. రిటైరైపోయి చక్రం తిప్పుతున్న డాలర్ శేషాద్రిని కూడా తొలగించడానికి టీటీడీ అధికారులు ఫైల్‌ను సిద్ధం చేశారు. ఆయనను తొలగించాల్సిందేనని.. టీటీడీ అధికారులపై… ఓ వర్గం తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసింది. కానీ ఆయనను తొలగించడం ప్రభుత్వం వల్ల కాలేదు. ఆయనను కొనసాగింపు ఇచ్చారు.
శ్రీవారికి జరిగే సేవల విషయంలో ఆయన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. ఆలయం గురించి శ్రీవారి పూజల గురించి ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని.. టీటీడీ వర్గాలే చెబుతూంటాయి. ఆయన రాకపోతే… పూజాకైంకర్యాలు చేసే వారిలో చాలా మందికి కాళ్లూ చేతులూ ఆడవు. బ్రహ్మోత్సవాలు వ్యవహారాలు మొత్తం ఆయనే దగ్గరుండి చేయిస్తారు. గతంలో ఓ సారి బ్రహ్మోత్సవాల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కోలుకున్నారు.