తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య మరోసారి ఆధిపత్య పోరాటం హెడ్లైన్స్కు ఎక్కుతోంది. నిన్న ఉదయం నుంచి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి … మున్సిపాలిటీ కార్యాలయంలోనే ధర్నా చేస్తున్నారు. దీనికి కారణం.. .అధికారులెవరూ తన మాట వినకపోవడమే. మున్సిపల్ చైర్మన్ హోదాలో తాడిపత్రిలో అభివృద్ధి పనులపై సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. మూడురోజుల ముందుగానే సోమవారం సమీక్ష ఉంటుందని అందరికీ సమాచారం ఇచ్చారు. అయితే సోమవారం వచ్చే సరికి అధికారులెవరూ ఆఫీసులో లేరు. వాకబు చేస్తే అందరూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దగ్గరకు వెళ్లారన్న సమాచారం వచ్చింది.
జేసీ ప్రభాకర్ రెడ్డి సమీక్ష చేస్తున్నారని తెలిసిన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా సమీక్ష ఏర్పాటు చేశారు. అయితే ఆయన మున్సిపల్ ఆఫీసులో కాకుండా.. తన నివాసంలో ఏర్పాటు చేశారు. అధికారుల్ని రమ్మని హుకుం జారీ చేశారు. అధికారంలో ఉన్న వారు కాబట్టి.. అందరూ హుటాహుటిన వెళ్లారు. ఆ సమీక్ష అయిన తర్వాతైనా.. అధికారులు వస్తారేమోనని.. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఆఫీసులోనే ఉన్నారు. కానీ మున్సిపల్ కమిషనర్ మాత్రం… ఎమ్మెల్యే ఇంటి నుంచి అటు నుంచి అటే సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో ప్రభాకర్ రెడ్డికి ఆగ్రహం వచ్చింది.
ఉన్నతాధికారులు వచ్చి… తనకు సమాధానం ఇచ్చే వరకూ తాను మున్సిపల్ ఆఫీసులోనే ఉంటానని రాత్రంతా.. మున్సిపల్ ఆఫీసులోనే ఉన్నారు. అక్కడే నిద్రపోయారు. ఈ రోజు కూడా.. అక్కడే ఉంటానని చెబుతున్నారు. మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పెద్ద ఎత్తున జేసీ అనుచరులు కూడా అక్కడకు చేరుకున్నారు. దీంతో తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రారంభమయింది. వైసీపీ నేతలను ధీటుగా ఎదుర్కొనేందుకు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు… తనదైన దూకుడు చూపిస్తున్నారు. దీంతో పరిస్థితులు తాడపత్రిలో రోజూ ఉద్రిక్తంగానే కనిపిస్తున్నాయి.