స్నేహితుల్ని మార్చుకోగలవు కానీ పొరుగువారిని కాదు అని గతంలో ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్ పేయి చెప్పారు. చాలా మంది అది నిజమే అనుకుంటారు కానీ.. పొరుగువార్ని కూడా మార్చేస్తామని ట్రంప్ లాంటి వారు అంటున్నారు. ఆయన తీరు చూసి అమెరికా పొరుగు దేశాలు కెనడా, గ్రీన్ ల్యాండ్, పనామా, మెక్సికో అసహనానికి గురవుతున్నాయి. ఈ దేశాలను అమెరికాలో కలిపేసుకుంటామని ఆయన తరచూ చెబుతూండటమే దీనికి కారణం.
ట్రంప్ తెంపరి తనం ఎలా ఉందంటే.. అమెరికాలో కెనడా కలిపోయినట్లుగా51వ రాష్ట్రంగా మారినట్లుగా గ్రాఫిక్స్ రిలీజ్ చేస్తున్నారు. ప్రధాని ట్రూడోని కెనడాలో ఓ భాగానికిగవర్నర్ గా నియమిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. ఇక పనామా గురించి చెప్పాల్సిన పనిలేదు. పనామా కాలువ నుంచి వచ్చిపోయే షిప్పుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆ కాలువను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించేశారు. అవసరమైతే దేశాన్ని కూడా కలిపేసుకుంటామంటున్నారు. గ్రీన్ ల్యాండ్ పైనా అదే మాట అంటున్నారు.
ట్రంప్ కుమారుడు తాజాగా తాము మూడు దేశాలను కొనేందుకు కార్ట్ పెట్టామన్నట్లుగా ఓ షాపింగ్ కార్ట్ పోస్టు చేశారు. తండ్రి మనస్థత్వం ఎలా ఉందో గుర్తించి ఆయనను మెప్పించడానికి ఇలా చేస్తున్నాడేమో కానీ ఇది ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమే అవుతుంది. కెనడా ప్రధాని ట్రూడోకి ఏం చేయాలో అర్థంకావడం లేదు. పదేపదే కించ పరుస్తున్న ట్రంప్ కు ఎలా సమాధానమివ్వాలో తెలియడం లేదు.
దేశాల్లో ఆక్రమణలకు పాల్పడాలన్న ఆలోచన దేశాల అధినేతలకు రాకూడదు. వస్తే అరాచకం జరుగుతుంది. ట్రంప్ కు అన్నీ ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి. ఏం జరుగుతుందో మరి !