యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలన్న తన దేశ ప్రజల నిర్ణయాన్ని సాక్షాత్ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ జీర్ణించుకోలేక రాజినామాకి సిద్దపడితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ మాత్రం బ్రిటన్ ప్రజల నిర్ణయాన్ని తెగ మెచ్చుకొన్నారు.
బ్రెగ్జిట్ రిఫరెండం ఫలితాలు వెలువడిన తరువాత ట్రంప్ స్పందిస్తూ, “యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలని బ్రిటన్ ప్రజలు చాలా మంచి నిర్ణయమే తీసుకొన్నారు. వారు తమ దేశాన్ని కాపాడుకొన్నారని నేను భావిస్తున్నాను. అది చాలా అద్భుతమైన గొప్ప నిర్ణయం. అందుకు వారిని నేను అభినందిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఇటువంటి లోపభూయిష్టమైన విధానాల పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు. అమెరికా ప్రజలు కూడా అదే విధంగా భావిస్తున్నారు. బహుశః రానున్న రోజుల్లో ఇంకా అనేక దేశాలు యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్లిపోవచ్చు,” అని అన్నారు. బ్రిటన్ ప్రధాని దేవి కామరూన్ రాజీనామా గురించి ట్రంప్ మాట్లాడేందుకు ఇష్టపడలేదు.
నాటో, ఐక్యరాజ్యసమితి తదితర అంతర్జాతీయ సంస్థలపై డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకొంటే బ్రిటన్ పౌరులని ఆయన ఈవిధంగా మెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగించదు. ఆ అంతర్జాతీయ సంస్థలన్నీ తమ మనుగడ కోసం అమెరికా మీదే మరీ ఎక్కువగా ఎక్కువగా ఆధారపడిపోయాయని, వాటిని పోషించవలసిన అవసరం అమెరికాకి లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అలాగే పాకిస్తాన్, సౌది అరేబియా వంటి దేశాల రక్షణ తమ బాధ్యత కాదని, అమెరికా ఇంకా ఆ భారం భరించే స్థితిలో లేదని ట్రంప్ అన్నారు. అన్ని దేశాలు తమ సమస్యలని తామే పరిష్కరించుకోవాలని, ఒకవేళ అమెరికా సహాయం కావాలనుకొంటే దానికి తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని, ట్రంప్ ఒక్క పక్కా వ్యాపార వేత్తలాగా మాట్లాడారు. యూరోపియన్ యూనియన్ లో సభ్యదేశంగా ఉన్న బ్రిటన్ కూడా ఇంచుమించు అమెరికా పరిస్థితినే ఎదుర్కొంటోంది కనుక బ్రిటన్ ప్రజల నిర్ణయాన్ని ట్రంప్ సమర్ధించారని భావించవచ్చు.