ప్రపంచ స్టాక్ మార్కెట్లకు డొనాల్డ్ ట్రంప్ వాత పెట్టి వెన్న పూశారు. టారిఫ్ల దెబ్బకు లక్షల కోట్లు కోల్పోయిన ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు గురువారం గ్రీన్ లోకి వచ్చాయి. ట్రంప్ టారిఫ్లు ప్రకటించిన తర్వాత జరిగిన నష్టాన్ని కవర్ చేయకపోయినా.. ఉన్నంతలో బెటర్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ట్రంప్ రెండు రోజుల కిందట తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారని ఒక్క చైనాపై మాత్రమే సుంకాలు కొనసాగిస్తారని ప్రచారం జరిగింది. ఆ కొద్ది సేపు ప్రచారానికే స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. కానీ ఆ ఆనందం వైట్ హౌస్ ఎక్కువ సేపు ఇవ్వలేదు. అ వార్తలు ఫేక్ అని ఖండించింది. దాంతో మళ్లీ నష్టపోయాయి.
హఠాత్తుగా ఆయన అదే నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించడంతో దిగాలుగా ఉన్న ఇన్వెస్టర్లకు మంచి బూస్ట్ ఇచ్చినట్లయింది. అమెరికాతో పాటు హాంకాంగ్, సింగపూర్ సహా అన్ని మార్కెట్లు గ్రీన్ లోకి వచ్చాయి. అయితే భారతీయ మార్కెట్లు, ట్రేడింగ్ చేసేవారు గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. ఈ రోజు మహవీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. దాంతో మార్కెట్లు ఓపెన్ కాలేదు. కానీ ట్రంప్ ఇచ్చిన ఉత్సాహం మాత్రం అలాగే ఉంది. అందరూ శుక్రవారం ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు.
గత కొద్ది రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు ఇరవై లక్షల కోట్లకుపైగా సంపదను కోల్పోయాయి. శుక్రవారం అందులో చాలా వరకూ రికవరీ అవుతుందని ఆశాభావంతో ఉన్నారు. ఈ రాత్రికి ట్రంప్ ఏదో ఓ రాయి వేయకపోతే.. భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం రోజు రికార్డు స్థాయిలో కోలుకునే అవకాశం ఉంది.