ఒక్క చైనాపై తప్ప.. ప్రపంచ దేశాలన్నింటిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల అమలును నిలిపివేశారు. 90 రోజుల పాటు నిలిపివేస్తూ.. తక్షణం అమల్లోకి వస్తాయని ఆయన తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించారు. అయితే చైనాపై మాత్రం సుంకాలు పెంచారు. 125 శాతం ఆ దేశ దిగుమతులపై సుంకాలు విధిస్తున్నట్లుగా తెలిపారు. చైనా తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యంగాలేదని ఆయన అంటున్నారు.
చైనా పోటాపోటీగా అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తోంది. ఇది ట్రంప్ కు నచ్చలేదు. అందుకే ఆ దేశంపై మాత్రం కోపం చల్లారలేదు. మిగతా దేశాలన్ని తమ దేశంతో చర్చలు జరిపేందుకు, సంప్రదింపులు జరిపేందుకు ఆసక్తి చూపాయని ట్రంప్ చెబుతున్నారు. అందుకే సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. సుంకాలు విధించిన తర్వాత ట్రంప్ చట్టసభల్లో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలను కించ పరిచారు. తాను సుంకాలు పెంచిన తర్వాత ప్రపంచదేశాలన్నీ సార్..ప్లీజ్ సార్ అంటూ కాళ్ల దగ్గరకు వచ్చాయని అత్యంత అసభ్యంగా మాట్లాడినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చర్చలకు అంగీకరించాయి కాబట్టి తాము ఆపేస్తున్నట్లుగా ఆయన రిలీఫ్ ఇచ్చారు.
సుంకాల పెంపుతో ప్రపంచ దేశాల్లో ప్రముఖ స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. చివరికి అమెరికా మార్కెట్లు కూడా. అమెరికా ప్రజలు కూడా నిరసనలు తెలుపుతున్నారు. మరో వైపు ఫార్మా రంగంపైనా పన్నులు విధిస్తామని చెప్పిన ట్రంప్.. రాత్రికి రాత్రి 90రోజుల పాటు పన్నులు నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల కిందట.. ఒక్క చైనాపై తప్ప.. అన్ని దేశాలపై పన్నులు ఎత్తేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ వైట్ హౌస్ వెంటనే ఖండించింది. అనూహ్యంగా రెండు రోజుల్లో అదే నిర్ణయాన్ని ప్రకటించారు.
ట్రంప్ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లకు పాజిటివ్ బజ్ కనిపించనుంది. ఇప్పటికే ప్రారంభమైన కొన్ని దేశాల స్టాక్ మార్కెట్లు గ్రీన్ లో ఉన్నాయి. భారత స్టాక్ మార్కెట్ కూడా ఊహించనంతగా పుంజుకునే అవకాశం ఉంది.