చైనా తమపై విధించిన టారిఫ్ల కన్నా చైనాపై తాము విధించిన టారిఫ్లను ఎలా తగ్గించుకోవాలా అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారు. ఆయనకు దారి కనిపించడం లేదు. చైనా చర్చలకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రపంచంలోని అన్ని దేశాలు చర్చించుకుందామని అంటే.. టారిఫ్లు నిలిపివేశారు. చైనా మాత్రం పోటాపోటీగా టాక్స్లు వేసింది . ఇప్పుడు చైనా వస్తువులు ఒక్క సారిగా భారం కావడంతో అమెరికాలో క్రమంగా సమస్యలు పెరుగుతున్నాయి.
అత్యంత కీలకమైన ఖనిజాల ఎగుమతిని కూడా చైనా నిలిపివేసింది. అవునన్నా.. కాదన్న చైనా తయారీ రంగంలో అత్యంత కీలక స్థానంలో ఉంది. నేరుగా తయారు చేయడమో.. ముడి పదార్థలు సరఫరా చేయడమో చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో చైనాను ఏకపక్షంగా దూరం పెట్టడం దాదాపు అసాధ్యం. అందుకే ట్రంప్ ఇప్పుడు చైనాతో మంచి డీల్ కుదురుతుందని.. చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. కానీ చైనా మాత్రం .. అమెరికాతో టారిఫ్ లపై ఎలాంటి చర్చలు జరగడం లేదని.. ట్రంప్ అబద్దాలు చెబుతున్నారని అంటున్నారు.
ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది అమెరికానే. టారిఫ్ ల వల్ల డాలర్ విలువ కూడా పడిపోతోంది. మరో వైపు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అందుకే చైనాతో డీల్ కుదుర్చుకోవాలని అనుకుంటోంది. ఏకపక్షంగా అమెరికానే టారిఫ్లు విధించింది కాబట్టి.. ముందుగా విధించిన టారిఫ్లు వెనక్కి తీసుకుని ఆ తర్వాత చర్చల ప్రతిపాదన వస్తే ఆలోచించాలని చైనా అనుకుంటోంది.