అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. ప్రచారం హోరెత్తిస్తున్నారు. ట్రంప్ వర్సెస్ బైడెన్ అన్నట్లుగా రాజకీయం సాగినప్పుడు ట్రంప్ కు తిరుగులేకుండా పోయింది. ఆయనపై బుల్లెట్ దూసుకొచ్చిన తర్వాత ఇక తిరుగులేదనుకున్నారు. కానీ అమెరికా రాజకీయాలు కూడా ఎన్ని మలుపులు తిరగాలో అన్ని మలుపులు తిరుగుతున్నాయి. బైడెన్ స్వచ్చందంగా వైదొలిగి కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ట్రంప్ కు తిరోగమన పరిస్థితి వచ్చింది.
బైడెన్ తో డిబేట్ లో ట్రంప్ ఓ ఆటాడుకున్నారు. కానీ హ్యారిస్ తో డిబేట్ లో మాత్రం… చేతులెత్తేశారు. బయటకు తానే గెలిచానని ఆయన చెప్పుకుంటున్నారు కానీ.. బయట జనం మాత్రం… పాపం ట్రంప్ అనుకుంటున్నారు. అందుకే మరోసారి హ్యారిస్ తో డిబేట్ వద్దంటున్నారు. అంటే ఓటమి ఒప్పుకున్నట్లేనన్న అభిప్రాయం పెరుగుతూండటంతో.. సరే అయితే ఆలోచిస్తానంటున్నారు. ట్రంప్ ది విద్వేష రాజకీయం. ఒకరిపై మరొకర్ని రెచ్చగొట్టడం ద్వారా..సగం మందిని తనకు అనుకూలం చేసుకునే రాజకీయం చేస్తున్నారు. అందుకే ఆయనకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది.
కానీ అమెరికా ఓటర్లలో అత్యధిక మంది హేట్ ను వ్యతిరేకిస్తున్నారు. అయితే దేశానికి బలమైన నాయకత్వం కోరుకుంటున్నారు. బైడెన్ నాయకత్వం అంత బలంగా లేదనుకుంటున్న జనం.. మొదట్లో ట్రంప్ వైపు మొగ్గారు. కానీ ఇప్పుడు కమలాహ్యారీసనే బెటర్ గా కనిపిస్తున్నారు. అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా అమె అయితేనే బెటర్ అన్న భావన పెరిగిపోతోంది. ఇది ట్రంప్ కు సమస్యగా మారింది. దీనికి ఆయన ప్రవర్తన కూడా కారణమే.