రాజకీయాల కోసం సొంత దేశంలో చిచ్చుపెట్టుకునే ఫార్ములా రాజకీయాల ప్రభావం ఇప్పుడు అమెరికాపై కనిపిస్తోంది. నూతన సంవత్సవరం రోజున అమెరికాలో జరిగిన ఉగ్ర ఘటనల వ్యవహారం సంచలనం అవుతోంది. ఒకరు ట్రక్కుతో దూసుకొచ్చి మనుషుల్ని తొక్కించేసి …తర్వాత కాల్పులు జరిపి చంపేశాడు. ఇంకొకడు సైబర్ ట్రక్‌తో ట్రంప్ హోటల్ ను పేల్చేసేందుకు ప్రయత్నించారు. మరొకరు నైట్ క్లబ్లో కాల్పులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాలన్నింటిలోనూ ఉగ్రకోణం ఉందని ఎఫ్‌బీఐ ఆరోపిస్తోంది. ఈ పనులకు పాల్పడిన వారు వలస వచ్చిన వారు కాదు .. అమెరికన్లే.
ట్రక్ దాడి చేసిన వ్యక్తి దగ్గర ఐసిస్ జెండా కనిపించింది. ఐసిస్ నిర్వీర్యం అయిపోయినా ఆ భావజాలాన్ని కొంత మంది ఎక్కించుకుని ఉగ్రదాడులకు పాల్పడుతున్నారని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. అంత ద్వేషం ఎందుకు అంటే.. ట్రంప్ వంటి విభజన వాదులు చేసిన రాజకీయాల కారణంగానే అని అనుకోక తప్పదు. ప్రజల్లో చీలికలు తెచ్చేందుకు చేసిన ప్రకటనలు, రాజకీయ విధానాలతో అమెరికాలో జరుగుతున్న డిబేట్ అంతా ఇంతా కాదు. ఎన్నికలకు ముందు ట్రంప్ ను చంపాలని చాలా మంది అనుకున్నారు . ఇలా ఎందుకు జరిగిందో విశ్లేషించుకోలేదు…ఫలితంగా ఇప్పుడు దేశం ఉగ్ర గుప్పిట్లోకి వెళ్తోంది.
వలస వచ్చిన వాళ్లు అని ఇతర దేశాల వారిని అవమానించారు. ఇస్లామోఫోబియాను పెంచారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇండియన్స్ పైనా అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలా దేశంలో ద్వేషం పెంచుకోవడం ద్వారా ట్రంప్ రాజకీయంగా లాభపడుతున్నారు కానీ అమెరికా నష్టపోతోంది. ఈ ఉగ్రవాద భావజాలం పెరిగిపోతే అమెరికా రావణకాష్టం అవుతుంది. అలా జరిగితే దానికి అగ్గిపుల్ల గీసిన వ్యక్తిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారు.