అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ మొన్న ఆదివారం దక్షిణ కాలిఫోర్నియాలో విజయం సాధించిన తరువాత మాట్లాడుతూ “మన దేశంలో సుమారు 58 శాతంకి పైగా ఆఫ్రికన్-అమెరికన్ యువకులకు ఉద్యోగాలు లేక తీవ్ర కష్టాలు పడుతున్నారు. నేను అధికారం చేపడితే మన దేశం నుండి ఉద్యోగాలను తన్నుకుపోతున భారత్, చైనా, మెక్సికో, జపాన్, వియత్నాం దేశాల నుండి ఆ ఉద్యోగాలను మళ్ళీ వెనక్కి తీసుకువచ్చి నిరుద్యోగంలో మ్రగ్గుతున్న ఆఫ్రికన్-అమెరికన్ యువకులకి ఉద్యోగావకాశాలు కల్పిస్తాను. నేను వారి గురించి ఇంతగా ఆలోచిస్తుండబట్టే మీడియాలో వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నట్లు కధనాలు వస్తున్నాయి,” అని అన్నారు.
భారత్ గురించి మాట్లాడుతూ ‘భారత్ ప్రగతి సాధిస్తున్నప్పటికీ దాని గురించి ఎవరూ మాట్లాదుకోవడం లేదు,” అని అన్నారు.
డోనాల్డ్ ట్రంప్ చాలా వివాదాస్పదంగా మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు పైకి కనబడుతున్నప్పటికీ, నిజానికి అదే ఆయన అసలు వైఖరి, వ్యక్తిత్వంగా భావించవచ్చును. ఆయన భారత్, చైనా దేశాల నుండి ఉద్యోగాలను వెనక్కి తీసుకువస్తానని చెప్పడాన్ని దేశంలోని సుమారు 29 శాతం జనాభా ఉన్న ఆఫ్రికన్-అమెరికన్లను ఆకట్టుకోవడానికేనని అనుకోనవసరం లేదు. ఆయన అధికారం చేపడితే తప్పకుండా అదే వైఖరిని అవలంభించవచ్చును.
సాధారణంగా ఇటువంటి కీలక సమయంలో చాలా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది. కానీ ట్రంప్ తన మాటలతో దేశంలో అన్ని వర్గాల, దేశాల ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేయడం బదులు, చాలా మందికి అభద్రతాభావం కలిగే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన మాటలలో భారత్ పట్ల అంత సదాభిప్రాయం కనబడటం లేదు. అంటే ఆయన ఇండో-అమెరికన్ల ఓట్లను వదులుకొనేందుకే సిద్దపడినట్లున్నారు. ఆయన మిగిలిన దేశాల గురించి, ముఖ్యంగా ముస్లింల గురించి చేసిన అభ్యంతకర వ్యాఖ్యల వలన అమెరికాలో స్థిరపడిన ఆయా దేశాల ప్రజల ఓట్లు, ముస్లింల ఓట్లు కోల్పోవచ్చును. అది ఆయన ప్రత్యర్ధి హిల్లరీ క్లింటన్ కి మేలు చేయవచ్చును. డోనాల్డ్ ట్రంప్ మాటలు, వ్యక్తిత్వం చూస్తుంటే ఒకవేళ ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటే, అమెరికాతో అన్ని దేశాలు, అలాగే అమెరికా అన్ని దేశాలతో తన సంబంధాలను పునర్నిర్వచించుకోవలసి రావచ్చును.