ఇష్టం వచ్చినట్లుగా పన్నులు పెంచినట్లుగా ప్రకటించి.. ఒక్క చైనాపై తప్ప.. మిగతా దేశాలపై 90 రోజుల పాటు వాయిదా వేసినట్లుగా ప్రకటించిన ట్రంప్ తాజాగా మరో బిస్కెట్ వేశారు. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రతీకార సుంకాల నుంచి మినహాయిస్తున్నట్లుగా తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గైడెన్స్ నుంచి ఈ సమాచారం బయటకు వచ్చింది. ఈ మినహాయింపు చైనా నుంచి వచ్చే వాటికీ వర్తిస్తుందన్నది ఇక్కడ అసలు విషయం.
దీనివల్ల ఆపిల్, సామ్సంగ్ వంటి కంపెనీలపై ధరలపై ప్రభావం ఉండదు. ఈ మినహాయింపులు శాశ్వతమా, తాత్కాలికమా అనేది ఇంకా స్పష్టత లేదు. ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి.. వీటిని కూడా ఎప్పుడైనా మార్చొచ్చని అనుకోవచ్చు. ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అన్నీ తయారీని చైనా కంపెనీలకు అప్పగించాయి. ఇటీవలి కాలంలో ఇండియా లాంటి చోట్ల కూడా యూనిట్లు పెట్టినప్పటికీ ఇప్పటికీ మెజార్టీ చైనా నుంచే వస్తాయి.
ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించిన తర్వాత అమెరికాలో గాడ్జెట్స్ సేల్స్ ఒక్క సారిగా పెరిగిపోయాయి. రేట్లు రెట్టింపు అయిపోతాయన్న భయంతో ఎక్కువ మంది కొనుగోళ్లు చేశారు. యాపిల్ వంటి కంపెనీలు ముందుగానే పెద్ద ఎత్తున సరుకును అమెరికా చేర్చుకున్నాయి. ఇప్పుడు ట్రంప్ వాటిపై పాత విధానంలోనే పన్నులు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు.