హైదరాబాద్: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీలో రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిమ్లను అమెరికాలోకి ప్రవేశించకుండా ఆపేయాలని పిలుపునిచ్చారు. క్యాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారం చెలరేగింది. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారు అతనిపై విమర్శలకు దీనిని ఆయుధంగా వాడుకుంటుండగా, మరోవైపు సోషల్ మీడియాలో అతని వ్యాఖ్యలకు మద్దతుకూడా బాగానే కనబడుతోంది. వాస్తవానికి ట్రంప్ అన్నదేమిటంటే, ప్రస్తుతం దేశంలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసేవరకు ముస్లిమ్ల ప్రవేశాన్ని నిలపాలని మాత్రమే. ట్రంప్ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మసీదులపై గస్తీ పెట్టాలని, అమెరికాలో నివసిస్తున్న ముస్లిమ్ల డేటాబేస్ రూపొందించాలని గతంలో పిలుపునిచ్చారు.
మరోవైపు తన తాజా వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ, అమెరికాలో ఇప్పటికే నివశిస్తున్న ముస్లిిమ్లకు ఆ వ్యాఖ్యలు వర్తించవని ట్రంప్ అన్నారు. తనకు ముస్లిమ్ స్నేహితులుకూడా ఉన్నారని, వారంతా చాలా మంచివాళ్ళని చెప్పారు. అయితే అమెరికాలోని ముస్లిమ్లలో ఈ దేశంపై ద్వేషం పెంచుకున్న ఒక వర్గం ఉందని అన్నారు. మొత్తంమీద ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలో పెనుదుమారాన్నే లేపాయి. ఈ ప్రభావం ట్రంప్ అభ్యర్థిత్వంపైనకూడా పడేటట్లు కనిపిస్తోంది.