అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ముందున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ నిన్న మరో బాంబు పేల్చారు. భారత్ తో సహా అనేక దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు ఎక్కువగా వినియోగించుకొనే హెచ్-1బి వీసా విధానాన్ని తను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. దాని వలన అమెరికా యువత చాలా తీవ్రంగా నష్టపోతోందని వారికి దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలను భారత్, చైనా వంటి విదేశాలు హెచ్-1బి వీసాతో తన్నుకుపోతున్నాయని ట్రంప్ అన్నారు. అమెరికా అంతటా వ్యాపించి ఉన్న తన కంపెనీలు కూడా ఈ హెచ్-1బి వీసాలను విరివిగా ఉపయోగించుకొంటున్నాయని డోనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పుకోవడం విశేషం. కానీ తను అధికారంలోకి వస్తే హెచ్-1బి వీసా విధానాన్ని రద్దు చేస్తానని చెప్పారు. డోనాల్డ్ ట్రంప్ చెపుతున్న ఈ మాటలు అమెరికన్ ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలవాలనే ఉద్దేశ్యంతో చెపుతునవిగానే పైకి కనిపిస్తున్నప్పటికీ, అవి ఆయన ఆలోచనలకు అద్దం పడుతున్నాయని భావించవచ్చును. కనుక ఒకవేళ ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయినట్లయితే ఆయన ఇప్పుడు చెపుతున్నవాటిని మెల్లగా అయినా తప్పకుండా అమలుచేస్తారని భావించవచ్చును. అదే కనుక జరిగితే అన్ని దేశాల కంటే ఎక్కువగా నష్టపోయేది భారతదేశమే. ఎందుకంటే ప్రతీఏటా వందలాది మంది భారతీయ సాంకేతిక నిపుణులు ఈ హెచ్-1బి వీసాలను ఉపయోగించుకొని అమెరికా వెళుతున్నారు.