అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించి మంట పెట్టే వరకూ ఆగేలా లేరు. రాజ్యాంగాన్ని అడ్డగోలుగా ఉల్లంఘించి మూడో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేట్టాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. ఇందు కోసం ఎన్ని మార్గాలున్నాయో అన్నీ అన్వేషిస్తున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎవరైనా రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టగలరు. మూడో సారి చాన్సే లేదు. అందుకే బిల్ క్లింటన్, జార్జ్ బుష్ లాంటి దిగ్గజాలు కూడా రెండు సార్లకే పరిమితమయ్యారు.
కానీ ట్రంప్ వారిలా కాదు… నియంతలా ఆలోచిస్తున్నారు. మూడో సారి ఎందుకు అధ్యక్షుడ్ని కాకూడదని అనుకుంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ చేయాలని మాత్రం ఆయన అనుకోవడం లేదు. ఎందుకంటే అంత బలం లేదు. అందుకే ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో జేడీ వాన్స్ అధ్యక్షుడిగా.. తాను ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తారట. జేడీ వాన్స్ గెలిచిన తర్వాత వైదొలుగుతారట. అప్పుడు ట్రంప్ ఆధ్యక్షుడిగా మారతారట. ఇదేనా ప్లాన్ అంటే.. ఇది కూడా తన ముందు ఉన్న ఆప్షన్లలో ఒకటి అని గడుసుగా చెబుతున్నారు ట్రంప్. అలా చేపట్టినా మూడో సారే అవుతుంది. రాజ్యాంగం అంగీకరించదు.
ట్రంప్ తాను అనుకున్నది నెరవేరకపోతే ఎంతకైనా తెగిస్తారు. రెండో సారి ఓడిపోయేసరికి ఆయన క్యాపిటల్ బిల్డింగ్ లోనే హింసకు ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది ఆ కేసుల్లో జైలుకు వెళ్తే.. ట్రంప్ వచ్చాక విడిపించారు. ఇక మూడో సారి అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని ఆయన బ్లైండ్ గా నిర్ణయించుకుంటే.. ఏం చేస్తారో ఊహించడం కష్టమేమీ కాదు. ఆ ప్రయత్నాలు అమెరికాలో మంట పెడితే.. అగ్రరాజ్యం అతలాకుతలం అయిపోతుంది.