అమెరికా అధ్యక్షుడు అంటే చాలా పవర్ ఫుల్. ఆయన ముందు .. ఆయన సాయం కోసం వచ్చిన వారు ఎంత గౌరవం ఇస్తారో.. ఇప్పించుకునేలా చేయాలో అగ్రరాజ్యానికి బాగా తెలుసు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఓ పూచిక పుల్ల అని తీసి పడేశాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. చిన్న పిల్లాడిలాగా జెలెన్ స్కీతో మీడియా ముందు వాదనకు దిగాడు ట్రంప్. ఇద్దరు వేర్వేరు అధ్యక్షులు ఇలా కీచులాడుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదేమో. ముఖ్యంగా అమెరికా విషయంలో.
రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపన చేస్తానని .. యుద్ధం ముగిస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు .. బలహీనమైన ఉక్రెయిన్ పీక నొక్కడం ద్వారా యుద్ధాన్ని సులువుగా ముగించాలని అనుకుంటున్నారు. పుతిన్ తో అవసరానికి మించిన స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన కోరిక మేరకు.. ఉక్రెయిన్ ను వదిలేసేందుకు రెడీ అయ్యారు. ఉక్రెయిన్ లో ఉన్న ఖనిజాలను రాయించుకుని.. రష్యా కళ్లపై పడి ఉండేలా ఒప్పందం చేసుకోకపోతే ఊరుకునేది లేదన్నట్లుగా ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అయితే తమకు ఇంత కంటే పోవడానికి ఏమీ లేదన్నట్లుగా జెలెన్ స్కీ ఉన్నారు. శాంతికి సిద్ధమే కానీ.. ఉక్రెయిన్ ను బలి చేయలేనని ఆయన చెబుతున్నారు.
ట్రంప్ తీరు అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికాకు చెడ్డపేరు తెలుస్తోంది. అగ్ర రాజ్యం అన్నట్లుగా కాకుండా.. స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టంగానే కనిపిస్తోంది. నాటో పేరుతో ఉక్రెయిన్ ను నిండా ముంచింది అమెరికానే. రష్యాకు వ్యతిరేకంగా పోరాడితే తామున్నామని అమెరికా నేతృత్వంలోని నాటోనే జెలెన్ స్కీకి దైర్యం చెప్పింది. దాని వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. నాటోలోని ఇతర దేశాలు రష్యాపై పోరాటానికి మద్దతు ఇస్తున్నా.. అమెరికా మాత్రం రష్యా వైపు మారిపోయింది. ట్రంప్ విధానం అది. పుతిన్ ను నమ్ముకుంటే అమెరికాకు ఏ గతి పడుతుందో ఎవరైనా ఊహించగలరని కానీ ట్రంప్ మాత్రం ఊహించలేకపోతున్నారని అంతర్జాతీయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ట్రంప్ పిచ్చికి తగ్గట్లుగా వ్యవహరిస్తూ మస్క్ మరింత ఆజ్యం పోస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో వ్యవహరించిన తీరు… సమావేశం తర్వాత ఆయన.. ఉక్రెయిన్ కు ఇచ్చిన నిధుల వివరాలు బయటకు తీయాల్సి ఉందని ట్వీట్ చేశారు. ఇదేదో చిన్న పిల్లవాడి బెదిరింపులా ఉంది కానీ.. ఓ దేశ పాలసీలా ఉంటుందా?. మొత్తంగా అమెరికాకు ప్రపంచ దేశాల ముందు ఉన్న పరువును రోడ్డున పడేస్తున్నారు ట్రంప్. అది అమెరికాకు నిజంగా కష్టకాలమే.