అగ్రరాజ్యమనే అమెరికా హోదాను డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికి తీసుకెళ్తారో కానీ అందరూ ఆయన నినాదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో ఆయన ఓటర్లను ఆకట్టుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు యాభైలక్షల డాలర్లకు పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పది లక్షల మందికి సభ్యత్వం ఇచ్చి ఐదు లక్షల కోట్ల డాలర్లను వెనకేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. డబ్బు సంపాదించడానికి ఇంత కన్నా సులువైన మార్గం ట్రంప్ టీంకు కనిపించినట్లుగా లేదు.
ఇప్పటి వరకూ ఉన్న EB-5 విధానంలో .. ఎనిమిది లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి.. పది మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పుడీ విధానాన్ని ఎత్తేసి నేరుగా డబ్బులు కడితే పౌరసత్వం ఇచ్చేయాలనుకుంటున్నారు. విధి విధానాలు రెండువారాల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగుల్ని రాచి రంపాన పెడుతున్న ట్రంప్ టీం.. ఇప్పుడు కొత్తగా విదేశీయులకు పౌరసత్వాన్ని డబ్బులకు ఇచ్చి.. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తారన్న బెంగ వారికి ప్రారంభమయింది.
ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అగ్రరాజ్యం అనే హోదాకు తగ్గట్లుగా లేదు. పన్నులు పెంచితే ఆయన ఆదాయం వస్తుందని అనుకుంటున్నారు.. కానీ దాని వల్ల పడే ప్రభావం గురించి ఆలోచించడం లేదు. రష్యాకు మద్దతిస్తే .. ఉక్రెయిన్ లాంటి బలహీన దేశాన్ని తొక్కేస్తే యుద్ధం ఆగిపోతుందని అనుకుంటున్నారు. గాజాలో బీచ్ సిటీ పెడితే అంతా శాంతే అనుకుంటున్నారు . ఆయన తీరు ప్రపంచానికి ఎంత నష్టమో కానీ.. అమెరికాకు మాత్రం తీరని నష్టం చేయబోతోందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.