అమెరికా వణికిపోతోంది. ఆర్థిక వ్యవస్థ కుంగిపోతోంది. స్టాక్ మార్కెట్ రోజు రోజుకు కుంచించుకుపోతోంది. ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోతోంది. ఇప్పటికి 300 లక్షల కోట్ల మేరకు స్టాక్ మార్కెట్ కరిగిపోయింది. ఇక కోలుకుంటుందని ఆశ కూడా లేకుండా పోయింది. ఇదంతా ఒక్క డీప్ సీక్ వల్ల కాదు.. అంత కంటే ఎక్కువగా ట్రంప్ వల్ల జరుగుతోంది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను తన వ్యాపార సంస్థలాగా నిర్వహించాలని అనుకుంటున్నారు. అక్కడే అసలు సమస్య వస్తోంది. ప్రపంచంపై పన్నులతో దండయాత్ర చేస్తున్నారు. కానీ దాని వల్ల తమకు చేటు జరుగుతుందన్న వాస్తవాన్ని మాత్రం గుర్తించడం లేదు. ట్రంప్ చేస్తున్న పన్నుల దందాతో చాలా దేశాల్లోనూ స్టాక్ మార్కెట్లు దెబ్బతింటున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టగానే చైనా డీప్ సీక్తో డీప్‌గా కొట్టింది.ఆ దెబ్బకు ట్రంప్ నిర్ణయాలు తోడయ్యాయి. ఫలితంగా ట్రంప్ పదవి చేపట్టగానే అమెరికన్లకు గట్టి షాకులు తగులుతున్నాయి.
ట్రంప్ ప్రపంచంపై పన్నులతో దండయాత్ర చేస్తూ ఉండవచ్చు కానీ.. అమెరికాలో ఇంకా ఎక్కువ అరాచకం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఉద్యోగులు ఊరకనే జీతాలు తీసుకుంటున్నారని అనుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లుగా ఆఫర్లు ఇచ్చి మరీ సాగనంపుతున్నారు. ప్రతి ఖర్చూ అనవసరమే అన్నట్లుగా ఉంటున్నారు. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా పారిశ్రామిక, వ్యాపార సామ్రాజ్యాలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. అమెరికా మెల్లగా మాంద్యం ముగింట నిలుస్తోంది.
అమెరికా మాంద్యంలోకి పడిపోతే ప్రపంచదేశాలు భారీగా ఇబ్బంది పడే పరిస్థితులు లేవని అంచనా వేస్తున్నారు. ట్రంప్ ఈ పరిస్థితిని తీసుకొచ్చేసినట్లే అనుకోవచ్చు. ఒకప్పుడు అమెరికా తుమ్మితే ప్రపంచానికి జ్వరం వచ్చేది. ఇప్పుడు అమెరికాను ఇతర దేశాల్లో ఒకటిగా మార్చేసే పనిలో ట్రంప్ ఉన్నారు. అది ఆఫ్రికాగా మారినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు.