అగ్రరాజ్యాధినేత అభిశంసనకు చేపట్టిన ప్రక్రియలో మరో ముందడుగు పడింది. ట్రంప్‌ను అభిశంసించడానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ప్రతిపక్ష డెమోక్రాట్లకే మెజార్టీ ఉంది. ఆ ప్రకారం… అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 230 ఓట్లు వచ్చాయి. ట్రంప్‌నకు అనుకూలంగా 197 ఓట్లు వచ్చాయి. ఇలా అభిశంసనకు గురైన మూడో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా ట్రంప్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ప్రతినిధుల సభ ఆమోదం పొందిన తర్వాత అభిశంసన తీర్మానం ఎగువ సభ అయిన సెనేట్‌కు చేరుతుంది. అక్కడ ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుంది. సెనెట్‌లో ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లకు మెజార్టీ ఉంది. వంద మంది సభ్యులుండే సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీకి 53 మంది సభ్యులున్నారు. డెమోక్రాట్లకు 45 మంది ఉన్నారు. ఇద్దరు తటస్థ సభ్యులున్నారు. సెనెట్‌లో మూడింట రెండు వంతుల మెజార్టీ ఉంటేనే అధ్యక్షుడి అభిశంసన సాధ్యం. అంటే ఓటింగ్‌లో రిపబ్లికన్ పార్టీకి చెందిన 20 మంది సభ్యులు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటెయ్యాలి.
త్వరలో ఎన్నికలకు వెళ్తున్న రాష్ట్రాలకు సంబంధించి నలుగురు రిపబ్లికన్ సెనేటర్లు ట్రంప్ అభిశంసనకు అనుకూలంగా ఓటు వేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ నలుగురు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేసినప్పటికీ ఇబ్బంది లేదని, అధ్యక్షుడికి వ్యతిరేకంగా 67 ఓట్లు వస్తేనే ఆయన దిగిపోవాల్సిన పరిస్థితి ఉంటుందని ట్రంప్ వర్గీయులు లెక్కలు కడుతున్నారు. ఇప్పటికై.. ట్రంప్ పదవికి వచ్చిన ముప్పేమీ లేదు.