శుక్రవారం రాత్రి ఫ్రాన్స్ లోని నైస్ నగరంలో జరిగిన ఐసిస్ ఉగ్రవాదుల దాడిపై అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రాంప్, డెమొక్రాట్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ చాలా భిన్నంగా స్పందించారు.
డోనాల్డ్ ట్రంప్ సి.ఎన్.ఎన్. న్యూస్ చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ “ఐసిస్ ఉగ్రవాదులు చేసిన ఈ పనిని ఫ్రాన్స్ దేశంపై చేసిన యుద్ధంగానే భావింఛి, ఐసిస్ ఉగ్రవాద సంస్థపై నాటో దేశాలన్నీ కలిఫై తక్షణమే యుద్ధం ప్రకటించాలి. ఐసిస్ ఉగ్రవాదం ప్రపంచానికి క్యాన్సర్ లాగ తయారయింది. దానిని సమూలంగా తొలగించకపోతే అన్ని దేశాలకి కూడా ప్రమాదమే. నేను అమెరికా అధ్యక్షుడినయితే, ఐసిస్ పై యుద్ధం ప్రకటించేందుకు కాంగ్రెస్ అనుమతి కోరుతాను,” అని అన్నారు.
ఈ సందర్భంగా అమెరికాలో స్థిరపడ్డ విదేశీయుల గురించి ట్రాంప్ మళ్ళీ తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. “దేశంలో ఒకప్పుడు యుద్ధం చేసేవారు యూనిఫారం ధరించేవారు కనుక వారు ఎవరితో పోరాడుతున్నారు? ఎందుకు పోరాడుతున్నారు? అనే విషయం అర్ధమయ్యేది. కానీ ఇప్పుడు మనపై మనకి తెలియని శత్రువులు దాడులు చేస్తున్నారు. వారు మన దేశంలోకి ఏవిధంగా ప్రవేశిస్తునారో…వారు ఎక్కడి నుంచి వస్తున్నారో..ఎక్కడ స్థిరపడ్డారో..అసలు ఎందుకు వస్తున్నారో..వారు ఎవరో కూడా మనకి తెలియదు. వారి వివరాలు తెలిపే ఎటువంటి రికార్డులు మన వద్ద ఉండవు. అటువంటి వారి వలనే ఇటువంటివి జరుగుతున్నాయి. వారి పట్ల మనం కటినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు.
డెమొక్రాట్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ఈ సంఘటనపై వేరే విధంగా స్పందించారు. ఆమె కూడా సి.ఎన్.ఎన్. న్యూస్ చానల్ ప్రతినిధి అండర్ సన్ కూపర్ తో మాట్లాడుతూ, “ఉగ్రవాదులతో అమెరికా చిరకాలంగా యుద్ధం చేస్తూనే ఉంది. అయితే నిన్న జరిగిన దాడి చాలా భిన్నమైనది. ఇటువంటి దాడులని ఎదుర్కోవడానికి సైనికశక్తి కంటే, నిఘా వ్యవస్థలని మరింత ఆధునీకరించుకొని ఉగ్రవాదుల కదలికల్ని, వారి కుట్రల్ని ముందుగా పసిగట్టి వారిని అడ్డుకోవడమే మంచిదని నేను అభిప్రాయ పడుతున్నాను. సిరియా భూతలంపై జరుగుతున్న యుద్ధంలోకి అమెరికాని కూడా లాగాలని ఐసిస్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. అయితే నిఘా వ్యవస్థల ద్వారా వారి సమాచారాన్ని సేకరించి వారిని ఎదుర్కోవడానికే నేను ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. అదే సమయంలో మన మిత్రదేశాలతో కలిసి ఐసిస్ ఉగ్రవాదులపై యుద్ధం కొనసాగిస్తూనే ఉంటాను. ఇటువంటి దాడులు జరిగాయని చెప్పి సిరియా నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మన ఆశ్రయాన్ని కోరుతూ వస్తున్న చిన్నారులని, మహిళలని, అనాధలని అడ్డుకోవడం సరికాదని నేను భావిస్తున్నాను. వారిలో యువకులు లేదా అనుమానంగా కనబడుతున్నవారి పట్ల అప్రమతంగా ఉండటం అవసరమే,” అని హిలరీ క్లింటన్ అన్నారు.
ఫ్రాన్స్ లో జరిగిన దాడితో అమెరికా ప్రజలు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. గట్టిగా ఖండిస్తున్నారు. ఈ సమయంలో హిల్లరీ క్లింటన్ సౌమ్యంగా చెప్పిన మాటల కంటే డోనాల్డ్ ట్రాంప్ చెప్పిన మాటలే ప్రజలని ఆకర్షించడం సహజం. అమెరికా ప్రజలు యుద్ధం కోరుకోకపోయినా ఐసిస్ ఉగ్రవాద సంస్థపై యుద్ధం అవసరమని భావిస్తే అందులో వింతేమీ లేదు. ప్రపంచంలో ఉగ్రవాదానికి బలైపోయిన దేశాలలో అమెరికా కూడా ఒకటి కనుక అమెరికన్లు డోనాల్డ్ ట్రాంప్ అభిప్రాయంతో ఏకీభవించవచ్చు. ఆ సంగతి సర్వేలో తేలవచ్చు.