ప్రీలాంచ్ ఆఫర్లు రియల్ ఎస్టేట్ రంగంలో బడామోసాలకు కారణం అవుతున్నాయి. తక్కువకే వస్తాయని ఉన్నదంతా ఊడ్చి రియల్ ఎస్టేట్ మోసగాళ్లకు పెట్టేస్తున్నారు మధ్యతరగతి ప్రజలు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు.. హైరైజ్ ప్రీమియం అపార్టుమెంట్లు అంటూ.. చదరపు అడుక్కీ రూ.4500కే అమ్ముతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. మొత్తం ఒకేసారి కట్టాలనే షరతు పెడుతున్నారు. కనీసం పునాదులు కూడా ఉండవు. రెండు, మూడేళ్లలో హ్యాండోవర్ చేస్తామని చెబుతారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామంటారు.కానీ అంతా బోగస్.
హైదరాబాద్‌లో సొంతిల్లు ఉండాలనే మధ్య తరగతి ప్రజల కలను ఆసరాగా చేసుకొని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రీ లాంచ్ అఫర్ల పేరిట భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే సమయంలోనే కొంత ,మొత్తం డబ్బు ఇస్తే ధర తగ్గుతుందనే ఉద్దేశంతో ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారిని నట్టేట ముంచుతున్నారు. హైదరాబాద్ సీసీఎస్‌లో ఇప్పటికే పలు సంస్థలపై కేసులు నమోదయ్యాయి. సాహితీ ఇన్ఫ్రా, భువనతేజ, జీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థలు వందల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాయి. వందల మంది సొంత ఇంటి కలను నిర్వీర్యం చేశారు.
Read Also : కొంగరకలాన్ మరో కోకాపేట !
తెలంగాణ రాష్ట్రంలో రెరా చట్టం అమల్లో ఉంది. దీని ప్రకారం.. రెరా నుంచి అనుమతి తీసుకున్నాకే ఎవరైనా ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ విక్రయించాలి. రెరా అనుమతి లేకుండా కనీసం ఒక బ్రోచర్ ని కూడా ముద్రించకూడదు. పైగా, బ్రోచర్ అయినా పేపర్ ప్రకటన అయినా తప్పకుండా రెరా నెంబర్‌ను ముద్రించాలి. కానీ, కొందరు బిల్డర్లు రెరాను తుంగలో తొక్కేసి.. గాలిలో మేడల్ని చూపెడుతూ.. ప్రీ లాంచ్ అంటూ.. అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను అమాయకులకు అంటగట్టేస్తున్నారు. కార్పొరేట్ ఏజెంట్ల సాయంతో ఫ్లాట్లను విక్రయించే విషసంస్కృతికి తెరలేపారు.
ఈ మోసాల నుంచి తప్పించుకోవాంటే… ముందుగా కొనుగోలుదారునికి ఉండాల్సింది కామన్ సెన్స్. అతి తక్కువకు వస్తుందంటే ముందుగా అసలు నమ్మవద్దు. ప్రీలాంచ్ ఆఫర్లు ఇచ్చే కంపెనీల విశ్వసనీయత చూడాలి. బడా కంపెనీలు ప్రీ లాంచ్ ఆఫర్లు ఇవ్వవు. రూల్స్ తెలుసుకుని జాగ్రత్తగా ఉంటే… కనీసం కష్టపడిన సొమ్మును కాపాడుకోగలుగుతారు