ప్రజా సమస్యలు అంటే అవి అందరికీ తెలియాల్సిందే. వాటిపై ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది కూడా బహిరంగంగా జరగాల్సిన చర్చే కదా! అంతేగానీ.. రాష్ట్ర సమస్యలు అనేవి ఒక పార్టీ అంతర్గత వ్యవహారంగా ఎలా చూడగలం..? తెలుగుదేశం పార్టీలో ఉన్న సమస్యలు ప్రజలకు అనవసరం. కానీ, అధికార పార్టీగా రాష్ట్ర సమస్య విషయంలో తెలుగుదేశం ఏం చేస్తోందనేది ప్రజలకు అవసరం. వాటి గురించి వివరంగా చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. కానీ, రాష్ట్ర సమస్యల్ని కూడా తమ అంతర్గత వ్యవహారాలుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతూ ఉండటం విడ్డూరంగా వినిపిస్తోంది!
సీఎం నివాసంలో తాజాగా ఓ సమావేశం జరిగింది. దీన్లో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కాస్త తీవ్రంగానే స్పందించారు. ఏపీ విషయంలో భాజపా సర్కారు అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టే విధంగా విమర్శలు చేశారు. దీనికి సమాధానంగా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ మిత్ర ధర్మం గురించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఒకసారి స్నేహం చేస్తే దానికి కట్టుబడి ఉంటుందని అన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే అంతర్గతంగానే చర్చించుకుంటామే తప్ప, వాటిపై రచ్చ చేసుకుని బయటకి వచ్చేసి రోడ్లెక్కడం ఉండదని చెప్పారు. రాష్ట్రానికి దక్కాల్సిన కేంద్రం కేటాయింపుల విషయంలో ఎక్కడా రాజీపడటం లేదనీ, కావాల్సినవాటి కోసం ఎన్నిసార్లైనా తాను ఢిల్లీ చుట్టూ తిరుగుతానని చెప్పారు. న్యాయం జరిగే వరకూ విశ్రాంతి తీసుకోననీ, ప్రజలకు నష్టం జరగకుండా డీల్ చేసుకుంటూ వస్తున్నామన్నారు. అయితే, ఈ విషయాలన్నీ బయట చర్చించుకోవడం సరికాదనీ, అందుకే అంతర్గతంగా చర్చిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి అందాల్సిన సాయం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తప్పకుండా న్యాయం చేస్తారనే నమ్మకం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే… కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన అంశాలపై లోలోపలే చర్చిస్తున్నారన్నమాట! భాజపాపై ఒత్తిడి పెంచడం కూడా లోలోపలే జరుగుతోందన్నమాట. బయటకి ఏదీ చెప్పరు.. ఎందుకంటే, అలా రోడ్లెక్కడం ఇష్టం లేదు కాబట్టి!
విభజన చట్టం ప్రకారం ఏపీ కేటాయింపులపై కేంద్రం స్పందించాలి. ఆశించిన స్థాయిలో భాజపా స్పందన కనిపించడం లేదు కాబట్టి, రాష్ట్రం డిమాండ్ చేయాలి. భాజపాతో పొత్తు ఉంది కాబట్టి వీటిపై అంతర్గతంగా ఒత్తిడి తెస్తున్నామని చెబితే ఎలా..? పొత్తు అనేది టీడీపీ, భాజపాల మధ్య ఉండే అంశం. ఆంధ్రాకి కేంద్రం కేటాయింపులు అనేవి ప్రజా ప్రయోజనాంశం. పార్టీ వ్యవహారాలపై అంతర్గతంగా ఏం చేసుకున్నా ఫర్వాలేదు. కానీ, ప్రజా సమస్యలపై కూడా ఇదే పంథాలో డీల్ చేస్తామని ముఖ్యమంత్రి చెబితే ఎలా..? పొత్తు కాపాడుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చంద్రబాబు మాట్లాడుతుండటం విశేషం. స్నేహధర్మం పాటించాలి, కానీ అదే సందర్భంలో రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చాలనే స్వధర్మం కూడా పాటించాలి కదా.