ముస్లీం మతంలో బహుభార్యత్వం ఉన్నా తప్పులేదనీ, ఇది తమ మతాచారమనీ, ఈ విషయం ఖురాన్ లో కూడా ఉన్నదని ఈ మతంలోని పురుషులు భావిస్తుంటారు. ముస్లీం పర్సనల్ లా ప్రకారం ముస్లీంమతస్థుడైన వ్యక్తి నాలుగుసార్లు వివాహం చేసుకోవచ్చని ఉంది. అయితే, ఖురాన్ ఏం చెప్పిందీ, ఏ సందర్భంలో బహుభార్యత్వం ప్రస్తావన చేసిందీ, ప్రస్తుత కాలంలో వీళ్లు ఎలాఅర్థం చేసుకుంటున్నారన్న విషయంపై గుజరాత్ హైకోర్ట్ ఒక కేసు విచారణలో సునిశితమైన వ్యాఖ్యలు చేసింది.
ఖురాన్ లో చెప్పింది సరిగా అర్థంచేసుకోలేకనే నేటి కాలంలో ముస్లీం మతస్థులు బహుభార్యత్వంవైపు ఆకర్షితులవుతున్నారనీ, స్వార్థపూరిత ఉద్దేశాలతోనే ఖురాన్ లో చెప్పినదాన్ని తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారని గుజరాత్ హైకోర్ట్ న్యాయమూర్తి జె.బి. పర్దివాలా అభిప్రాయపడ్డారు. దేశప్రజలందరికీ నిష్పక్షపాతంగా ఉండేలా ఒకే విధమైన సివిల్ కోడ్ ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైనదని ఆయన భావించారు. అప్పుడే అందరికీ ఒకే తరహా న్యాయం జరుగుతుందని చెప్పారు.
పిటీషన్ దారుడు జఫర్ అబ్బాస్ మారుమనువు చేసుకున్నందుకు అతని భార్య భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) క్రింద కేసుపెట్టింది. ఆమె దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ని సవాలు చేస్తూ భర్త అబ్బాస్ హైకోర్టుని ఆశ్రయించారు. తన సమ్మతి లేకుండానే అబ్బాస్ మారుమనువు చేసుకున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు ఆమె ఐపీసీ 494 సెక్షన్ ని ప్రస్తావించారు. భార్యా, లేదా భర్త బతికిఉండగానే మరో పెళ్ళి చేసుకోవడమన్నది నేరమని ఈ సెక్షన్ లో ఉంది.
అయితే, ముస్లీంలకు ఈ సెక్షన్ వర్తించదన్నది అబ్బాస్ వాదన. ముస్లీం పర్సనల్ లా ప్రకారం ముస్లీం మతంలోని పురుషులు నాలుగుసార్లు వివాహం చేసుకోవచ్చుకనుక, ఈ ఎఫ్ఐఆర్ న్యాయపరిశీలనకు సైతం నోచుకోరాదన్నది అతని వాదన.
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పర్దివాలా కొన్ని కీలకమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పవిత్రగ్రంథమైన ఖురాన్ ని ముస్లీం పురుషులు తప్పుగా అర్థంచేసుకుంటూ ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను పొందాలనుకుంటున్నారనీ, అయితే, ఖురాన్ లో పాలీగమీ సదుద్దేశంతో ఉన్నప్పటికీ, నేటి కాలంలో దాన్ని (ఆ పద్ధతిని) స్వార్థచింతనతో వాడుకుంటున్నారని జస్టిస్ వ్యాఖ్యానించారు. ఖురాన్ లో పాలీగమీ ఉన్నప్పటికీ అది కొన్ని షరతులకు లోబడే ఉండటాన్ని ఆయన గుర్తుచేశారు. పైగా ముస్లీం పర్సనల్ లా సైతం భార్యను క్రూరంగా చూడమని చెప్పలేదనీ, అత్తింటినుంచి తరిమేయమని అంతకన్నా చెప్పలేదనీ, అలా భార్యను బయటకుగెంటి రెండోసారి పెళ్ళిచేసుకోమని ఎక్కడాలేదని జస్టిస్ ఈ కేసు పరంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి పనులుకు రక్షణగా దేశంలో ఏ చట్టం నిలబడలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని పౌరులందరికీ వర్తించేలా ఒకే మోస్తరు సివిల్ కోడ్ ఏర్పాటుకు ప్రయత్నించాలని జస్టిస్ పర్దివాలా సూచించారు. బహుభార్యత్వమన్నది ముస్లీం పురుషులకున్న ప్రాధమిక హక్కు ఏమాత్రం కాజాలదని స్పష్టం చేశారు. కోర్టు తన అభిప్రాయాలను వెల్లడించే క్రమంలో ఖురాన్ లోని అనేక ఫంక్తులను, ప్రముఖ వ్యక్తుల సూక్తులను కూడా ఉటంకించింది. కేసు తీర్పు ఎలా ఉన్నప్పటికీ, జస్టిస్ పర్దివాలా చేసిన వ్యాఖ్యలు అటు ముస్లీం మతస్థుల్లోనూ, ఇటు పాలకుల్లోనూ ఆలోచనలు రేకెత్తించింది. బహుభార్యత్వంపై ఏకాభిప్రాయం సాధించి ఒకే తరహా చట్టాన్ని తీసుకురాగలిగితే మహిళల కన్నీళ్లు తుడిచినవారమవుతాము.
– కణ్వస