హైదరాబాద్: ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలుతోంది ‘ఖాన్’ త్రయం అన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి సూపర్ స్టార్ ఖాన్ లతో పెట్టుకుంటే ఏమవుతుంది. బాలీవుడ్లో పుట్టగతులుండవు. అర్జున్ రామ్‌పాల్, యోయో హనీసింగ్, ఫరా ఖాన్ వంటి వారు షారుక్ ఆగ్రహానికి గురయ్యి తీవ్రంగా నష్టపోయారు.
అర్జున్ రామ్‌పాల్ ఒక టైమ్‌లో షారుక్-కరణ్ జోహార్లతో సన్నిహితంగా ఉండేవారు. వరసగా సినిమాలలో బుక్ అవుతుండేవారు, బాలీవుడ్లో జరిగే పెద్ద పెద్ద పార్టీలన్నింటిలో కనిపిస్తుండేవారు. అయితే తర్వాత ఏమయిందో, ఏమోగానీ షారుక్‌కు, రామ్‌పాల్‌కు మధ్య చెడింది. అంతే! రామ్‌పాల్‌కు అవకాశాలు ఉన్నట్లుండి ఆగిపోయాయి. దానికితోడుగా – హృతిక్ రోషన్ మాజీ బార్య సుశేన్తో ఎఫైర్ ఉన్నట్లు పుకార్లు జోరుగా రావటం అతని కెరీర్‌ను మరింత దెబ్బతీసింది.
యోయో హనీసింగ్ పాట ఒక్కటైనా లేకుండా బాలీవుడ్లో భారీ సినిమాలేవీ ఉండేవికావు ఒక సమయంలో. అయితే కొన్ని నెలలుగా అతని పాట ఒక్కటికూడా కొత్త సినిమాలలో ఉండటంలేదు. షారుక్‌కు యోయో నచ్చకపోవటంతో ఇండస్ట్రీ అతనిని పక్కన పెట్టేసింది.
కొరియో గ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్‌కూడా ఒక సమయంలో బాలీవుడ్ బాద్షా ఆగ్రహాన్ని చవిచూశారు. తన చిత్రం తీస్మార్ ఖాన్‌లో నటించటానికి నిరాకరించటంతో షారుక్‌తో మళ్ళీ పనిచేయబోనని ఫరాఖాన్ శపథం చేశారు. ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అవటం, ఆమె భర్త శిరీష్ కుందర్పై షారుక్ చేయి చేసుకోవటం పరిణామాల తర్వాత ఫరా కాళ్ళబేరానికి రాక తప్పలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసి హేపీ న్యూ ఇయర్ చేయటం, అది సూపర్ హిట్ కావటంతో ఫరా కెరీర్ మళ్ళీ గాడిలో పడింది.