తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ పరిశ్రమల శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఫ్లెక్సీలూ బ్యానర్ల వంటి హడావుడి చెయ్యద్దని ఇప్పటికే మంత్రి కేటీఆర్ అభిమానులను కోరారు. వేడుకల పేరిట సొమ్ము వృథా చెయ్యకుండా, ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తే మంచి పనులకు ఉపయోగపడుతుందని కేటీఆర్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొంతమంది అభిమానులు ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించేయాలని మంత్రి ఆదేశించడం విశేషం. అదే ఆయన విలక్షణ శైలి!
నిజానికి, సీఎం కేసీఆర్ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసినా, తనకంటూ సొంత గుర్తింపును, తనదంటూ సొంత శైలినీ పనితీరులో అలవరచుకున్నారు కేటీఆర్. సామాన్యుల నుంచి సాఫ్ట్ వేర్ కంపెనీల అవసరాల వరకూ అన్నీక్షుణ్నంగా అర్థం చేసుకున్న నాయకుడు ఆయన. తెలంగాణ ఏర్పాటు క్రమంలో.. ఒకదశలో చతికిల పడిపోయిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మళ్లీ నిలబెట్టిన ఘనత కేటీఆర్ దే. ఇంకోపక్క, చితికిపోయిన చేనేత పరిశ్రమకు కొత్త ఊపు తెచ్చే ప్రయత్నంలోనూ విజయం సాధించారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక టీ హబ్ ఏర్పాటు, టీఎస్ ఐపాస్ వంటి విధానాలతో ఇతర దేశాల దృష్టిని ఆకర్షించారు. విదేశాల్లో పర్యటిస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే పనిని ఆయనే స్వయంగా తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్, ఆపిల్, సిస్కో, అమెజాన్, ఫాక్స్ కాన్ వంటి దిగ్గజ కంపెనీల అధినేతల్ని రాష్ట్రానికి ఆహ్వానించారు. దీంతోపాటు రతన్ టాటా, అజీమ్ ప్రేమ్ జీ వంటి దేశీయ దిగ్గజాలతో కూడా భేటీలు అవుతూ… హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మీద పడిన అనిశ్చిత ముద్రను రూపుమాపడంలో ఆయన విజయం సాధించారనే చెప్పొచ్చు. ఇక, నేటి తరం నాయకుడిగా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారాయన. ట్విట్టర్ ద్వారా తన దృష్టికే వచ్చే సమస్యలపై వెంటనే స్పందిస్తుంటారు.
కేటీఆర్ లో మరో పార్వ్శం… సామాన్యుల్లో అతి సామాన్యుడిగా కనిపించడం! అమెరికాలో చదువుకుని, అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డ కేటీఆర్, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కీలక దశలో తండ్రి కేసీఆర్ కి చేదోడువాడోదుగా ఉండేందుకు సొంత గడ్డకి తిరిగి వచ్చేశారు. ఉద్యమంలో భాగంగా వారానికి నాలుగురోజులపాటు రోడ్ల మీదే ఉండేవారు. 2009లో సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, కేవలం 171 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయితే, కొద్దిరోజుల్లో ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా రాజీనామా చేసి… తరువాత జరిగి ఉప ఎన్నికల్లో 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దాంతో ప్రజల్లో కేటీఆర్ కు ఏర్పడిన గుర్తింపు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ మాండలికంపై తండ్రికి మించిన పట్టు ఆయనకి ఉందంటే ఆశ్చర్యం లేదు. తెలుగులో అలవోకగా ఆకర్షణీయంగా ఉపన్యసించే నాయకుడు కేసీఆర్ అనుకుంటే… ఆ తరువాత అదే స్థాయిలో భాషపై పట్టున్నంది కేటీఆర్ కి అనడంలో సందేహం లేదు. ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడగలిగే కేటీఆర్… తెలంగాణ ఉద్యమ వాణిని జాతీయ స్థాయిలో వినిపించేందుకు జాతీయ ఛానెల్స్ డిబేట్లకు వెళ్తూ ఉండేవారు. అలా ఉద్యమ దశలో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు.
తెలంగాణ ఏర్పాటు తరువాత నుంచీ తెరాస పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. కేసీఆర్ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసినా… పాలనలోనూ, వ్యవహార శైలిలోనూ తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నారు. ఓపక్క ఐటీ మంత్రిగా ఎంత హైటెక్ గా కనిపిస్తారో… మరోపక్క సగటు తెలంగాణ మనిషిగా కూడా సాధారణ ప్రజల్లో తానూ ఒకడిగా ఉండటం కేటీఆర్ విలక్షణ శైలి అనొచ్చు.