సౌమ్యుడు, సాహితీ ప్రియుడు, క్లాస్ డైరెక్టర్‌గా ముద్ర వేసుకొన్న దర్శకుడు.. క్రిష్. గౌతమి పుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్లో కాస్త ఆవేశంగా మాట్లాడాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం.. ఖబడ్దార్’ అనేశాడు. అంటే ఓ రకంగా సవాల్విసిరినట్టే. సవాల్ ఎవరికి విసురుతారు??? తన ప్రత్యర్థికేకదా. క్రిష్ మాటల్లో ‘ఆ’ అర్థం ఉన్నా, లేకున్నా మెగా ఫ్యాన్స్ మాత్రం ‘మన హీరోకి వార్నింగ్ ఇచ్చాడా’ అనే స్థాయిలో చర్చించుకొంటున్నారు. వెబ్ మీడియా కూడా క్రిష్ మాటల్లో నానార్థాల్ని వెదికి పట్టే క్రమంలో విజయవంతమైంది. అయితే.. తన `ఖబద్దార్`కి వేరే అర్థాలొస్తున్నాయని గ్రహించిన క్రిష్.. వాటిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
”తెలుగు జాతి గొప్పదనం చూపించే చిత్రమిది. తెలుగు జాతిని, భాషని తక్కువ స్థాయిగా అంచనా వేసేవాళ్లని ఖబద్దార్ అంటూ హెచ్చరించానంతే. దానికి వేర్వేరు అర్థాలు తీయొద్దు. చిరంజీవిగారంటే నాకు అభిమానం. ఆయన ఇంటి హీరోలు అల్లు అర్జున్, వరుణ్ తేజ్‌లతో సినిమాలు చేశా. కంచె సినిమా సమయంలో ఆయన అందించిన ప్రోత్సాహం మర్చిపోలేనిది. ఆ సినిమా చూసి ప్రతీ సీన్ గురించి నాతో మాట్లాడారు. అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతా..” అంటూ క్లారిఫై ఇచ్చేశాడు క్రిష్. ఇలాంటి వివాదాలు రేగినప్పుడు తక్షణం స్పందించి వివరణ ఇచ్చేయడం.. మంచి పద్ధతే. చినికి చినికి గాలివాన అవ్వకుండా.. తీసుకొనే ముందుజాగ్రత్త అన్నమాట. క్రిష్ క్లారిటీ ఇచ్చేశాడు కాబట్టి ‘ఖబద్దార్’ ఎపిసోడ్‌కి భరతవాక్యం పడిపోయినట్టే.