కరోనా సోకి చనిపోయిన వారి సంఖ్య కంటే..కరోనా సోకిందనో.. సోకుతుందనో భయపడి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. ఇప్పటికీ కొన్ని కొన్ని చోట్ల కరోనాకు భయపడి ఏళ్ల తరబడి హౌస్ అరెస్టులు చేసుకుని గడిపేస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తూ ఉండటమే దీనికి ఉదాహరణ. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు చేసిన అతి ప్రచారమో.. డేటా విప్లవం వల్ల చేతుల్లోకి వచ్చిన ప్రపంచ వార్తా సమాచారంలో డిజిటల్ రూపంలో చేరిన “ఫేక్ న్యూస్ వైరస్” కారణమో కానీ కరోనా అంటే.. ఓ భయంకరమైన విషయంగా మారిపోయింది. పాజిటివ్ వచ్చిందంటే వణికిపోయే పరిస్థితి కల్పించింది. మొదటి , రెండో వేవ్‌లలో కరోనా వచ్చిన వారిని .. జాగ్రత్తల పేరుతో సమాజం మొత్తం వెలి వేసినట్లుగా చూడటం ప్రజల మానసిక స్థితిపై ప్రభావం చూపింది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగు పడుతున్నాయి అనుకుంటున్న సమయంలో చైనా నుచి మరో ముప్పు ముంచుకొస్తోంది. కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్ 7 అక్కడ విస్తరిస్తోంది. ఇండియాలోనూ కేసులు బయట పడ్డాయి. ఇక ప్రభుత్వాలు అప్రమత్తమవుదాం హడావుడి ప్రారంభించాయి. ఈ హంగామాను చూసి సామాన్య జనం.. ఏదో లాక్ డౌన్ ముంచుకొస్తోందేమోనని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ కోణంలోనే ప్రభుత్వాలు ఇప్పుడు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా ప్రజలకు భరోసా కన్నా భయమే ఎక్కువగా కల్పిస్తున్నారు. దీనికి తాజాగా ఉదాహరణ ప్రస్తుతం దేశంలో ఏర్పడుతున్న కరోనా కొత్త రకం బీఎఫ్ 7 కొత్త రకం భయం !
సీజనల్ వైరస్‌గా మారి నాలుగో వేవ్ గా వస్తున్న వైరస్
కరోనా అనేది సీజనల్‌గా వచ్చేదిగా మారిపోయింది. ఒక్క సారి రివైండ్ చేసుకోండి. ఈ ఏడాది జనవరిలోనూ ఖచ్చితంగా ఇదే పరిస్థితి ఉంది. కరోనా ధర్డ్ వేవ్ వచ్చింది. ప్రభుత్వాలు జాగ్రత్లు తీసుకున్నాయి. టెస్టులు చేయించుకున్న అనేక మందికి వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. లక్షణాలు కనిపించిన వారు టెస్టులు చేయించుకోకపోయినా ఇంట్లో ఉండి మందులు వాడారు. ఇప్పుడు మళ్లీ నాలుగో విడత వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. కొన్ని దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. మన దేశంలోనూ వైరస్ వ్యాప్తిపై ఆందోళనలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాసింది. ప్రధానమంత్రి ప్రత్యేకంగా సమీక్ష చేశారు. దేశంలోకి వచ్చి వారందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు ఖచ్చితంగా చేశారు. పార్లమెంట్లో కూడా మోదీ సహా బీజేపీ ఎంపీలు మాస్క్ లతో కూర్చుని ఓ సందేశాన్ని పంపారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్దిష్టమైన చర్యలేమిటో మాత్రం స్పష్టత లేదు. వారు చేస్తున్నవన్నీ రాజకీయం కోసమేనని అందరికీ అనిపిస్తే అది .. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వ విధానాలదే తప్పు. ఎందుకంటే.. అసలు కరోనా గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో క్లారిటీ రాక ముందే వారి దృష్టి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వైపు మళ్లింది. యాత్ర ఆపేయాలని నేరుగా ఆరోగ్యమంత్రి మాండవీయ లేఖ రాశారు. ఇది రాజకీయం కాక మరేమిటి ?. ఇదేనా కరోనా విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు భరోసా ఇచ్చేలా వ్యవహరించాల్సిన పద్దతి.
ఇక్కడా వెంటనే అప్రమత్తం.. మాస్కులతో పార్లమెంట్లో కూర్చున్న మోదీ, బీజేపీ ఎంపీలు
కేంద్రం కరోనా బాధ్యతలను విస్మరిస్తోందని గత రెండు వేవ్‌లలో స్పష్టమన విమర్శలొచ్చాయి. ఫస్ట్ వేవ్ మొత్తంలో లాక్ డౌన్ వేస్తే చాలు కరోనా కనిపించకుండా పోతుందని.. దానికి క్రెడిట్ పొందవచ్చనుకుని లాక్ డౌన్ విధించారు. అది కరోనా వల్ల ఎంత మంది చనిపోయారో.. లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా బతుకులు చితికిపోయి.. అంతకంటే రెండు,మూడింతలు మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అయింది. ఇలా చెప్పడానికి సైంటిఫిక్ లెక్కలు అవసరం లేదు. ప్రతి ఒక్కరికి పరిచయస్తుల్లో ఎవరో ఒకరు ఆర్థికంగా దివాలా తీయడమో… తీవ్రకష్టాలు పడి ఆస్తులన్నీ పోగొట్టుకోవడమో.. ఆత్మహత్య చేసుకోవడమో చేసిన వారు ఉన్నారు. ఆ తర్వాత కేంద్రం లాక్ డౌన్ విషయాన్ని రాష్ట్రాలకు వదిలేసింది. సూచనలు మాత్రమే చేసింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తోంది. విదేశాల్లో కేసులు పెరుగుతున్నాయి.. చైనాలో అల్లకల్లోలం అవుతుందని తెలియగానే.. కేంద్రం రాష్ట్రాలకు అప్రమత్తం అవ్వాలని లేఖ రాసింది. లేఖతో పాటు సమీక్షల్లోనూ రాష్ట్రాలకు సూచనలు చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేపట్టే నిర్దిష్ట చర్యల ఊసు లేదు. గతానుభవాల దృష్ట్యా ఈ తరహా ధోరణి ఏమాత్రం మంచిది కాదన్నది అందరూ అనుకునేమాట.
కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకం ?
కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారమే కరోనా వైరస్ తాజా విజృంభణకు కారణమైన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బిఎఫ్-7 కూడా మన దేశంలో వెలుగులోకి వచ్చింది. బుధవారం నాటికి దేశంలో ఈ రకం వైరస్ ముగ్గురికి సోకింది. ఇది బలంగా ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని, ఇంక్యుబేషన్ వ్యవధి తక్కువగా ఉండటంతో పాటు ఒకరి నుండి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, వ్యాక్సిన్ల సామర్ధ్యాన్ని సైతం అధిగమిస్తుందని అంతర్జాతీయంగా నిర్ధారించారు. మన దేశంలో బిఎఫ్-7 రకం తొలి కేసును అక్టోబర్‌లోనే గుజరాత్లో గుర్తించారు. ఆ తరువాత ఇప్పటి వరకు మరో మూడు కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వీటిలో రెండు గుజరాత్ లోనే నమోదుకాగా, మరొకటి ఒడిశాలో వెలుగులోకి వచ్చింది. జాన్స్ హాప్కిన్స్ కోవిడ్ ట్రాకర్ తాజా గణాంకాల ప్రకారం గడిచిన 28 రోజుల్లో (డిసెంబర్ 21 నాటికి) జపాన్‌లో అత్యధికంగా 34 లక్షల కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో 16 లక్షల కొత్త కేసులు, 1,385 మరణాలు సంభవించాయి. అమెరికాలో గత 28 రోజుల్లో 15,89,284 మందికి వైరస్ సోకింది. కోవిడ్ 19 వెలుగులోకి వచ్చినప్పటినుండి ఆ దేశంలో మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 100 మిలియన్లకు చేరింది. ఫ్రాన్స్‌లో 15,26,427 మంది ఈ కాలంలో కొత్తగా వైరస్ బారిన పడ్డారు. బ్రెజిల్లో 9,45,568 మందికి వైరస్ సోకగా, 3,125 మంది మరణించారు. చైనాలో 9,17,308 కేసులు నమోదుకాగా, 646 మరణాలు సంభవించాయి. జీరో కోవిడ్ పాలసీని సడలించిన తరువాత చైనాలో వైరస్ ఉధృతంగా వ్యాపిస్తోంది. జీరో కోవిడ్ విధానాన్ని కార్పొరేట్ మీడియా తీవ్రంగా విమర్శించిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఈ సమయంలోనే మన దేశంలో 6,482 మంది వైరస్ బారిన పడగా 86 మంది మృతి చెందినట్లు జాన్స్ హాప్కిన్స్ కోవిడ్ ట్రాకర్ నమోదు చేసింది. చూస్తూంటే ఇది కాస్త ప్రమాదకరంగానే అనిపిస్తోంద. అలాంటప్పుడు 120 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి పాలకులు ఏం చేాయలి ?
కరోనా అంతమైపోయిందని బూస్టర్ డోసులు కూడా ఆపేసిన కేంద్రం … ఇప్పుడు హడావుడి
కరోనా వ్యాప్తితో గత మూడేళ్ల కాలంలో దేశంలో కోట్లాది మంది ఆప్తులను కోల్పోయారు. ఆకస్మిక లాక్డౌన్ సామాన్యుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కోల్పోయిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ జరగలేదు. ఆర్థిక సంక్షోభం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టడంతో పాటు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వైద్య, ఆరోగ్య వ్యవస్థలను తక్షణమే బలోపేతం చేసుకోవాలి. దానికవసరమైన నిధులను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాలి. మందులకు కొరత రాకుండా చూడాలి. వ్యాక్సినేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా చెబుతున్నప్పటికీ దాదాపుగా 27 శాతం మంది ఇంకా మొదటి విడత వ్యాక్సినే అందలేదు. రెండు డోసులు వేసుకోని వారి సంఖ్య 32 శాతం దాకా ఉంది. ఇక బూస్టర్ డోస్ లెక్కల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. కరోనా లేదు అని అనుకున్నప్పుడు బూస్టర్ డోస్ ఖర్చు ఎందుకని కేంద్రం పంపిణీని నిలిపివేసింది. ఈ వాస్తవాన్ని గుర్తించి ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించడానికి కేంద్రం ఇప్పటికైనా సిద్ధపడాల్సి ఉంది.
ప్రజల్లో ఇప్పటికే ఓ రకమైన భయ ప్రచారం… ధైర్యం కల్పించే బాధ్యత అధికారం చేతుల్లోనే… చేతల్లోనే !
ఇప్పటికే ప్రజల్లో ఓ రకమైన పానిక్ ప్రారంభమయింది. మూడు రోజుల్లోనే దీనిపై విపరీతమైన చర్చ జరుగుతోంది. మీడియాలో విస్తృతంగా భయపెట్టడం కూడా ప్రారంభమయింది. ఆ వేరియంట్ ఇంత ప్రమాదకరమట.. అంత ప్రమాదకరట.. లఅనే దగ్గర్నుంచి లాక్ డౌన్ వరకూ చర్చలు జరుపుతూనే ఉన్నారు. ముందుగా కేంద్రం.. ఇలాంటి భయానక వాతావరణాన్ని నియంత్రించే ప్రయత్నం చేయాలి. ఇందు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కరోనా పై అతి సమాచారం కాకుండా.. అసలైన సమాచారం మాత్రమే ప్రజలకు చేరేలా నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఖచ్చితంగా సమాచారం ప్రజలకు విస్తృతంగా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు భయం పోవడానికి… చేయాల్సింది నిజం తెలిసేలా చేయడమే. ఈ విషయంలో కేంద్రం సక్సెస్ అయితే చాలా వరకూ కరోనాను కంట్రోల్ చేసినట్లే. ప్రతీ విషయాన్ని రాజకీయంతో ముడిపెట్టి ఆలోచన చేస్తే మొదటికే మోసం వస్తుంది. కరోనా విషయంలో రాజకీయ క్రిడెట్లు.. డెబిట్లు గురించి అసలు ఆలోచించకూడదు. ఎందుకంటే.. ఈ వైరస్.. మామూలు రోగం మాత్రమే కాదు.. మానసిక రోగాన్ని విస్తరింప చేస్తుంది. మందులతో కరోనాను మాన్పించవచ్చు కానీ.. భయం లేదా మానసిక కరోనా ను మాత్రం.. ఏ మందులూ ఆపలేవు. ఒక్కసారి మనసులో అలాంటి పరిస్థితి ప్రజల్లో ఏర్పడితే.. అది ఎన్నో రకాల ఇతర సమస్యలకు దారి తీస్తుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కొత్త వేరియంట్ వ్యాప్తి విషయంలో తీసుకోవాల్సిన చర్యల విషయంలో అత్యంత నిపుణలైన వారిని కమిటీలుగా నియమించి .. వారికే మానిటరింగ్ చేసే బాధ్యతలివ్వాలి. ఇందులో మానసిక నిపుణలకూ చాన్సివ్వాలి. ఇవి మాత్రమే కాదు.. ప్రజల్లో కరోనా కంటే ముందే వచ్చే భయాన్ని పోగొట్టి.. భయం వద్ద… జాగ్రత్త చాలు అని చెప్పేలా… చర్యలే ప్రజలకు ధైర్యాన్నిస్తాయి. మహమ్మారిని నియంత్రించడంలో వారందరినీ భాగస్వామలను చేస్తాయి. అలా జరిగితేనే కోవిడ్ నాలుగో వేవ్ లో ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా.. భారత్ యుద్ధంలో విజయం సాధిస్తుంది. ఇది అంతా అధికారం చేతుల్లో ఉన్న వారి చేతుల్లోనే.. చేతల్లోనే ఉంది.