దూరదర్శన్ వార్తలు అనగానే శాంతి స్వరూప్… శాంతి స్వరూప్ అనగానే దూరదర్శన్ వార్తలు గుర్తొస్తాయి. చిత్రలహరి, అందులో వచ్చే పాటలు, ఆదివారం పూట వచ్చే తెలుగు సినిమా.. ఇవన్నీ 80ల్లో పుట్టిన తరానికి ఎలాంటి జ్ఞాపకాలో… శాంతి స్వరూప్ కూడా అంతే. విషాదం, వినోదం, విధ్వంసం, విచారం, విజయోత్సవం ఇలా…. ఎలాంటి వార్త అయినా ప్రసన్నవదనంతో చదవడం శాంతి స్వరూప్ స్టైల్. ఆయన వాచకం స్పష్టంగా ఉంటుంది. తెలుగు పదాల్ని చాలా అందంగా, అర్థవంతంగా పలుకుతారాయన. ‘వార్తలు చదువుతున్న శాంతిస్వరూప్’ అనగానే కళ్లు టీవీ స్క్రీన్ల వైపు అప్రయత్నంగానే మళ్లుతాయి. అదీ.. ఆయన బ్రాండ్. తొట్ట తొలి తెలుగు న్యూస్ రీడర్‌గా ప్రసిద్ధికెక్కారు. ఒకటా రెండా ఏకంగా 28 ఏళ్ల పాటు దూరద్శన్లోనే న్యూస్ రీడర్‌గా పని చేశారు.
అప్పట్లో టెలీ ప్రాప్టర్లు ఉండేవి కావు. ఆయన పేజీలు చూడకుండానే వార్తలు చదివేవారు. ఆ తరవాత మెల్లగా టెలీ ప్రాప్టర్ వచ్చింది. ఈరోజుల్లో ఎన్ని ఆధునిక సదుపాయాలు ఉన్నా, తప్పులు చదివేస్తున్నారు న్యూస్ రీడర్లు. మరి ఆ కాలంలో ఓ వార్తని చదివి, అర్థం చేసుకొని, పొల్లుపోకుండా చదవడం అంటే మాటలా? వార్తలు చదవడమే కాదు, చాలామంది ప్రముఖుల్ని దూరదర్శన్ కోసం ఇంటర్వ్యూలు చేశారు. అవి కూడా చాలా పాపులర్ అయ్యాయి. ప్రైవేటు ఛానల్స్ పుట్ట గొడుగుల్లా పెరిగిపోయిన తరవాత దూరదర్శన్‌కి ఆదరణ తగ్గింది. అయినా చాలామంది శాంతి స్వరూప్ కోసమే దూరదర్శన్ ఆన్ చేసేవారు. ఆయన దూరదర్శన్ విడిచి వచ్చేసిన తరవాత చాలా టీవీ ఛానళ్లు.. ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ఆహ్వానించాయి. కానీ.. శాంతి స్వరూప్ ఒప్పుకోలేదు. పనిచేసినన్ని రోజులు ఎలాంటి వివాదాలకూ పోకుండా, అంకిత భావంతో ఉద్యోగం చేసి, న్యూస్ యాంకర్ల అధ్యాయంలో తొలి పేజీ తనకంటూ లిఖించుకొన్న శాంతి స్వరూప్ మరణం.. బుల్లి తెరకు తీరని లోటే.