హైదరాబాద్: కేసీఆర్ ఘనంగా చెప్పుకుంటున్న ఐడీహెచ్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వెనక కొత్త కోణాన్ని తెలుగుదేశంపార్టీ బయటకు తీసింది. ఈ ఇళ్ళు కట్టింది కేంద్ర నిధులతోనని, టీఆర్ఎస్ ప్రభుత్వంమాత్రం ఘనతంతా తమదేనని చెప్పుకుంటోందని ఆరోపించింది. టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ఐడీహెచ్ కాలనీలో కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను చూపి కేసీఆర్ వరంగల్ ఉపఎన్నికలో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇది సొమ్ము కేంద్రానిది, సోకు కేసీఆర్‌ది అన్న చందాన ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఈ ఏడాది 83,678 ఇళ్ళ నిర్మాణంకోసం రు.1,633 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం రు.680 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు. కేంద్రం నిధులను తన నిధులుగా చెప్పుకుంటూ కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంపై ఆర్భాటం చేసుకుంటున్నారని అన్నారు.
2014లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి 22 లక్షల కుటుంబాలకు ఇళ్ళు లేవని గుర్తించిన విషయాన్ని రావుల గుర్తు చేశారు. తెలంగాణలో ఈ ఏడాది 83,678 ఇళ్ళకోసం కేంద్రం నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 60 వేల ఇళ్ళు మాత్రమే నిర్మించాలని నిర్ణయించటంపై ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వందల ఇళ్ళు సైతం నిర్మించలేకపోయారని రావుల విమర్శించారు.
సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో శిధిలావస్థలో ఉన్న ఇళ్ళను కూల్చి 580 చదరపు అడుగుల విస్తీర్ణంతో 396 ఇళ్ళను అపార్ట్మెంట్లుగా నిర్మించారు. ఈ కాలనీని మొన్న కేసీఆర్ ప్రారంభించి, లబ్దిదారులకు పట్టాలు అందజేశారు. అయితే ఈ ఇళ్ళ కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందంటూ పెద్ద సంఖ్యలో మహిళలు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను నిలదీశారు. పైరవీలు చేసినవారికే ఇచ్చారంటూ మండిపడ్డారు. మొత్తానికి నిరసనలు, హర్షాతిరేకాల మధ్య ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ప్రారంభోత్సవం జరిగింది.