double ismart movie review
తెలుగు360 రేటింగ్ 2/5
పూరి జగన్నాథ్. తెలుగు సినిమాకు సరికొత్త కమర్షియల్ పాఠం నేర్పిన దర్శకుడు. ‘బద్రి’, ‘ఇడియట్’, ‘పోకిరి’… ఒకటా? రెండా? హీరో అంటే పూరి సినిమాల్లోని హీరోనే, స్పీడంటే పూరీదే అన్నట్టు సాగింది ఆయన ప్రయాణం. అయితే ఆ స్పీడు ఈమధ్య అస్సలు కనిపించడం లేదు. ఆ నైపుణ్యం ఏమైపోయిందో అనే బెంగ వచ్చేసింది. ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్టు కొట్టి, ఊపిరి పీల్చుకొన్నా – ఆ తరవాత వచ్చిన ‘లైగర్’ పూరిని మరింత వెనక్కి లాక్కెళ్లింది. నవతరం దర్శకులు దూసుకుపోతున్న కాలం. పూరి మళ్లీ తనని తాను నిరూపించుకోవాల్సిన సమయం. ఇక్కడ నిలబడాలంటే గెలవాల్సిందే అనే పరిస్థితులు. వీటి మధ్య `డబుల్ ఇస్మార్ట్` తీశాడు పూరి. ‘ఇస్మార్ట్ శంకర్’ కుదుపుల్లో ఉన్న పూరి ని మళ్లీ హైవే ఎక్కించింది. ఇప్పుడు కూడా అదే పని చేసిందా? ‘డబుల్ ఇస్మార్ట్’ లో పాత పూరి మళ్లీ కనిపించాడా?
బిగ్ బుల్ (సంజయ్‌దత్) మాఫియా డాన్. తనకు బ్రైయిన్ ట్యూమర్. ఎంతో కాలం బతకడు. ఇంత డబ్బున్నా – నేను చావడం ఏమిటన్నది బుల్ వేదన. తన మేధస్సు, ఆలోచనలు, వందేళ్లకు సరిపడా ప్రణాళికలు వృధా కాకూడదని అనుకొంటాడు. అందుకే తన బ్రెయిన్‌ని మరొకరిలో కాపీ, పేస్ట్ చేయాలని ఫిక్సవుతాడు. చాలామందిపై ప్రయోగాలు జరుగుతాయి. కానీ ఫెయిల్ అవుతుంది. ఇలాంటి దశలో హైదరాబాద్ లో ఉన్న ఇస్మార్ట్ శంకర్ (రామ్) గురించి తెలుస్తుంది. ఇది వరకే తన బుర్రలో చిప్ పెట్టారని, కాబట్టి ఈ ప్రయోగానికి తనే సూటవుతాడని భావిస్తాడు. అక్కడ్నుంచి ఇస్మార్ట్ శంకర్ ని పట్టుకొనే వేట మొదలవుతుంది. మరి ఇస్మార్ట్ శంకర్ దొరికాడా? బిగ్ బుల్ మెమొరీ… శంకర్‌కు షిఫ్ట్ చేశారా? చేస్తే ఆ తరవాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
‘ఇస్మార్ట్ శంకర్’ మాస్ కథే. చాలా రెగ్యులర్ ఫార్మెట్ లో సాగుతుంది. అయితే హీరో బుర్రలో చిప్ పెట్టడం అనేది కొత్త అంశం. అది బాగా వర్కవుట్ అయ్యింది. డబుల్ ఇస్మార్ట్ లో అంతకు మించి ఏదో చూపించాలి. కానీ మళ్లీ అదే ‘సిమ్’ ఆట ఆడేశాడు పూరి. ‘ఈ సినిమాని ఒళ్లు దగ్గర పెట్టుకొని తీశా’ అని పూరి ప్రచార కార్యక్రమాల్లో చెప్పాడు. అయితే ఆ లక్షణం.. ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనిపించలేదు. తీతలో, రాతలో పూరి మారలేదు. అదే పాత పూరి. ఇస్మార్ట్ శంకర్‌గా రామ్ చేసే విన్యాసాలు ఇది వరకే చూసేశాం. తన డైలాగ్ డెలివరీ.. బాడీ లాంగ్వేజ్ తొలి భాగంలోనే ఎంజాయ్ చేశాం. ఇప్పుడు కూడా అవే చూపిస్తానంటే ఎలా..? బుల్ గా సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు. పైగా సంజూ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ తీసుకురాలేకపోయింది.
మదర్ సెంటిమెంట్ పై పూరికి గురి ఎక్కువ. ఈ కథని అలానే మొదలెట్టాడు. తొలి సన్నివేశాలు చూస్తే పూరి ఈసారి కథపై దృష్టి పెట్టాడనిపిస్తుంది. కానీ క్రమంగా ఆ ఫీలింగ్ కూడా చచ్చిపోతుంది. హీరోయిన్ కనిపించగానే అంగాంగ వర్ణనలు చేయడం, ‘నువ్వు నన్ను ప్రేమించాల్సిందే’ అంటూ వెంట పడడం.. పాత పూరి మార్క్. అయితే అప్పటి సన్నివేశాల్లో ఉన్న మెరుపు ఇప్పుడు లేదు. అదే తేడా. సౌత్ ఇండియా – నార్త్ ఇండియా అనే పాయింట్ మధ్యలో ఎక్కడో లేవనెత్తాడు పూరి. ఈ సినిమా కనీసం ఈ పాయింట్ చుట్టూ నడిపించినా బాగుండేది. చివర్లో దేశ భక్తయినా ఏరులు పారేది. ఆ పాయింట్ రెండు మూడు డైలాగులకు పరిమితం చేశాడు. ఫైట్లు, పాటలూ.. ఇవన్నీ కమర్షియల్ మీటర్ లో ఉంటే సరిపోతుందనుకొన్నాడు పూరి. కానీ.. వాటిని కలపాల్సింది కథే అనే విషయం మర్చిపోయాడు.
అలీ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పూరి సినిమాల్లో అలీ పాత్రలు బాగా పేలాయి. ఈసారి కూడా అదే మ్యాజిక్ జరుగుతుందనుకొన్నారు. కానీ తెరపై అలీని చూస్తే కంపరం కలుగుతుంది. తన హావభావాలు వెగటు పుట్టిస్తాయి. అలీ అదేదో భాష మాట్లాడుతుంటాడు. ఆ పదాలు బండ బూతుల్ని ధ్వనింపజేస్తుంటాయి. ఈ ట్రాక్ అప్పటికప్పుడు రాసుకొని, తెరకెక్కించి, అతికించారు. దాన్ని ఎడిట్ రూమ్ లో చూసుకొన్నప్పుడైనా తీసి పారేయాల్సింది. పూరి ఈ సినిమా కోసం ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేయలేదు అని చెప్పడానికి అలీ ట్రాక్ మరో నిదర్శనం.
ఇస్మార్ట్ శంకర్‌లో రామ్ ఏం చేశాడో, ఇక్కడా అదే చేశాడు. పెద్ద తేడా లేదు. రామ్ సీన్లు కట్ చేసి చూపిస్తే ఏది ఇస్మార్ట్ శంకరో, ఏది డబుల్ ఇస్మార్టో చెప్పలేం. డాన్సులు ఇరగదీశాడు అని రాయడం మరీ రొటీన్ అయిపోయింది. రామ్ డాన్సుల్లానే. కావ్య థాపర్ పూరి మార్క్ హీరోయిన్ పాత్రలో సెటిలైపోయింది. `రా` ఏజెంట్ అనే ట్విస్టు చివర్లో ఇచ్చి, అప్పటి వరకూ వ్యాంపు పాత్రలా తీర్చిదిద్దారు. ఓ స్కేల్ అంటూ పాటించకపోవడం ఆ పాత్రకున్న స్పెషాలిటీ. సంజయ్ దత్ బొమ్మలా నిలబడ్డాడు. తన వల్ల ఈ పాత్రకు ఒరిగిందేం లేదు. పాత్రలో బలం లేనప్పుడు సంజూ భాయ్ మాత్రం ఏం చేస్తాడు? అలీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది. గెటప్ శ్రీను ఉన్నా, ఉపయోగం లేదు.
మణిశర్మ పాటల్లో మాస్‌కి నచ్చేవి ఉన్నాయి. అయితే వాటి ప్లేస్ మెంట్ బోర్ కొట్టించేసింది. ‘ఇక్కడో పాట వస్తుందన్నమాట’ అని ఆడియన్ ముందే ఫిక్సయిపోతాడు. నేపథ్య సంగీతం కూడా అంత గొప్పగా లేదు. పూరి సినిమా ఎలా ఉన్నా, మాటలు బాగుంటాయి. లోతైన ఫిలాసఫీ ఏదో వినిపిస్తుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ ఆ అదృష్టాన్నీ కలిగించలేదు. క్లైమాక్స్ ఫైట్ కాస్త భారీగా ఉంటుంది. కాకపోతే… అప్పటికే థియేటర్లో ప్రేక్షకులకు నీరసాలు వచ్చేస్తాయి. పూరి మరోసారి తన అభిమానుల్ని నిరాశ పరిచాడు. పూరి అప్ డేట్ అవ్వాల్సిన సమయం వచ్చేసిందని ఈ సినిమా ఇంకాస్త గట్టిగా బల్ల గుద్ది మరీ చెబుతుంది.
తెలుగు360 రేటింగ్ 2/5