తెలంగాణ కాంగ్రెస్ నేతలకు డబుల్ టాస్క్ అయిపోయింది. ఓ వైపు మునుగోడు ఉపఎన్నిక. మరో వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించడానికే ఇలా ఉపఎన్నికలు పెట్టారేమో అన్నట్లుగా మునుగోడు ఉపఎన్నిక కీలక దశలో ఉన్నప్పుడు రాహుల్ తెలగాణలోకి ఎంట్రీ ఇస్తున్నారు. దాదాపుగా పదిహేను రోజుల పాటు సాగే ఆయన పాదాయాత్ర అయిపోయే సరికి మునుగోడులో ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది. నేతలంతా రాహుల్ గాంధీ టూర్లో బీజీగా ఉంటారు.
ఇక ఉపఎన్నికలో విధులు నిర్వహించేది ఎక్కడ? ఎవరికి వారు రాహుల్ దృష్టిలో పడేందుకు .. ప్రయత్నిస్తారు. దీంతో మునుగోడులోనే ఉండి పార్టీని చూసుకొమ్మంటే ఒక్కరు కూడా ఉండరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనీసం రాహుల్ పాదయాత్రకు కూడా ఉండటం లేదు. ఆయన విదేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ఆయన ఇక కాంగ్రెస్ కు లేనట్లేనని ఫిక్సయిపోతున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పాదయాత్రను సమన్వయం చేసుకోవాలి. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకోవాలి. ఈ పనుల్లో ఉంటూనే మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. ఇక ముందు ఆ అవకాశం ఉండదు. అసలే మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ .. యుద్ధం చేసుకుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ రేసులో లేదని చెప్పడానికి ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయని రేవంత్ ఆరోపిస్తున్నారు. కనీసం అలా కాదు.. తాము రేసులో ఉన్నామని చెప్పుకోవడానికైనా కాంగ్రెస్ పార్టీ.. మునుగోడులో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి డబుల్ టాస్క్ అయినట్లుగా ఉంది. ఆయన ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారో !?