సాక్షి తెలంగాణ మెయిన్ పేపర్ లో ఈరోజు ఓ వార్త వచ్చింది! ‘ఆపరేషన్ ఆకర్ష్ కు మరింత పదును’ అంటూ తెరాస ఆకర్ష్ వ్యూహాం గురించి లోపలి పేజీలో రాశారు. ప్రతిపక్షాలను మానసికంగా మరింత బలహీనం చేయడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆకర్ష్ మంత్రాన్ని తెరమీదికి తెస్తున్నారని ఆ కథనం సారాంశం. టీడీపీలో ఇంకా మిగిలి ఉన్న నేతలతోపాటు, కాంగ్రెస్ లో కొంతమంది సీనియర్లపై గులాబీ పార్టీ గాలం వేస్తోందట. దీని కోసం గత ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకుల వివరాలను, ఆ ఎన్నికల్లో వారికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయనే లెక్కల్నీ తీస్తున్నారట. నేరుగా తెరాస నేతలు డీల్ చేస్తే కుదరని చోట, పార్టీలో ఇదివరకే వచ్చి చేరిన ఇతర పార్టీల నేతల్ని రంగంలోకి దించుతున్నారనీ, ముఖ్యంగా తెరాస కాస్త బలహీనంగా ఉందనుకున్న స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించారనీ, అక్కడి ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవాలనేది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోందన్నది ఈ కథనం విశ్లేషించారు.
ఇతర పార్టీల నేతలకు తెలంగాణ అధికార పార్టీ గాలం వేస్తోంది… ఒక్కలైన్లో చెప్పాలంటే ఆ కథనం ఇదే. అయితే, ఇప్పుడు విలువల గురించి మాట్లాడుకుందాం! ఏ పత్రికకైనా రాష్ట్రానికో రకమైన విలువలు ఉండవు కదా. రాజకీయ కథనాల విషయంలో కొన్ని సిద్ధాంతాల పట్ల ఒకేరకమైన ప్రమాణాలు పాటించాలి. విలువలతో కూడిన జర్నలిజం మాదీ అని చెబుతున్నప్పుడు.. ఆ విలువలు ఆంధ్రాలో ఒకలా, తెలంగాణలో మరోలా ఉండవు కదా! కానీ, ఈ ఫిరాయింపుల వార్తనే చూడండి.. ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలూ లేవు, కేవలం ఉన్నది మాత్రమే రాశారు. కానీ, ఆంధ్రాలో ఫిరాయింపుల వార్తల విషయంలో ఎప్పుడైనా ఇలా ‘జస్ట్ రిపోర్టింగ్’ కి పరిమితమయ్యారా..? రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతా లేకుండా పోతోందనీ, రాజ్యాంగ స్ఫూర్తిని భ్రష్టుపట్టించేస్తున్నారనీ, ఫిరాయింపుల్ని ప్రోత్సహించడమనేది అధికార పార్టీ చేతగాని తనానికి నిదర్శనమనీ, ఇతర పార్టీల నేతలపై ఆధారపడే దుస్థితి అధికార పార్టీకి వచ్చిందనీ… ఇలా చాలాచాలా రాస్తారు.
నిజానికి, రాష్ట్రం ఏదైనా సరే ఈ తరహా ఫిరాయింపు రాజకీయాల్ని బాధ్యతగల మీడియాగా తప్పుబట్టాలి. అంతేగానీ, తెలంగాణలో తెరాస చేస్తే ఒకలా, ఆంధ్రాలో టీడీపీ చేస్తే మరోలా స్పందించడమేంటీ..? ఆంధ్రాలో టీడీపీ కూడా ఇలాంటి వ్యూహరచనలో ఉందని తెలిస్తే.. ఆ వార్త ఆంధ్రా ఎడిషన్ లో బ్యానర్ అయి కూర్చుంటుంది. తెలంగాణలో తెరాస చేస్తే దాన్ని లోపలి పేజీలకు పరిమితం చేస్తోంది. సాక్షి విధానం ఎలా ఉందంటే.. ఆంధ్రాలో టీడీపీతోనే వైకాపా పోరాటం కాబట్టి.. అక్కడి జంప్ జిలానీల గురించి అదే పోరాట స్థాయిలో పత్రికలో రాసేస్తారు. తెలంగాణలో వైకాపా లేదు, తెరాసతో పనిగట్టుకుని వైరం పెంచుకోవాల్సిన రాజకీయ అవసరం కూడా లేదు. కాబట్టి, ఇక్కడ ఇతర పార్టీల నుంచి నేతల్ని తెరాస లాక్కుంటున్నా… అది కూడా తెరాస బలపడే వ్యూహంగానే సాక్షి చూపించే ప్రయత్నం చేస్తోంది.