విజయ్ దేవరకొండతో మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈనెల 9… విజయ్ పుట్టిన రోజున అధికారిక ప్రకటన వచ్చింది. ఇదో పిరియాడిక్ డ్రామా అని చెప్పారు తప్ప, టైటిల్ ఏమిటి? నేపథ్యం ఎలాంటిది? అనే విషయాల్ని మైత్రీ వివరించలేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో విజయ్ డబుల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. తండ్రీ కొడుకులుగా విజయ్ కనిపించనున్నాడని సమాచారం. విజయ్ ద్విపాత్రాభినయం చేయడం ఇదే తొలిసారి. అంతేకాదు, విజయ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార్ట. దాదాపు రూ.100 నుంచి రూ.120 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబోలో సినిమా సెట్స్‌పై ఉంది. విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతోంది. అది పూర్తయిన వెంటనే… రాహుల్ సంకృత్యన్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కథానాయిక, ఇతర సాంకేతిక వర్గాన్ని ఎంచుకొనే పనిలో చిత్రబృందం తలమునకలై ఉంది. రాహుల్ సినిమా అయ్యాకే, రవికిరణ్ కోలాతో విజయ్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.