సార్వత్రిక ఎన్నికల్లో మూడు విడతల పోలింగ్ పూర్తయింది. ఈ మూడు విడతల్లోనూ.. ఉదయం పది గంటల వరకూ.. ఈవీఎంల మొరాయింపు అనే మాట… పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో ఏదో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. మొదటి విడత పోలింగ్ జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం పది గంటల వరకూ.. దాదాపుగా 30 శాతం పోలింగ్ బూత్‌లలో.. ఓటింగ్ ప్రారంభం కాలేదు. ఆ స్థాయిలో కాకపోయినా… రెండో విడతలో జరిగిన తమిళనాడు పోలింగ్‌లోనూ అదే పరిస్థితి ఉంది. ఇక మూడో విడత పోలింగ్ జరుగుతున్న యూపీలోని కొన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉంది. ఇవే ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసలేం జరుగుతోంది..?
బీజేపీకి ఇబ్బందులున్న చోటే ఈవీఎంల ఇబ్బందులెందుకు..?
ఒక్కో దశ పోలింగ్ జరుగుతున్న కొద్దీ.. ఈవీఎంలపై.. సందేహాలు పెరుగుతూ వస్తున్నాయి. తొలి దశలో ఏపీలో గందరగోళం అయితే.. రెండో దశలో.. తమిళనాడు… ఇప్పుడు మూడో దశలో ఈవీఎంలు మొరాయించాయి. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లోనే ఈవీఎంలు ఎందుకు ట్రబుల్ ఇస్తున్నాయి బీజేపీ తీవ్రంగా టార్గెట్ చేసిన ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయనే ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. టీడీపీని మళ్లీ గెలవనివ్వబోమని… బీజేపీ చాలెంజ్ చేసింది. ఎన్నికల నిర్వహణ ఎంత దారుణంగా జరిగిందో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇక తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. డీఎంకేను నిలువరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. అక్కడా… ఈవీఎంలు మొరాయించాయి. ఇక యూపీ బీజేపీకి.. చావో రేవో అన్నట్లుగా ఉన్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలోనూ ఈవీఎంలు తేడా కొట్టాయి. ఇదే అనేక మందికి అనుమానాలు కలిగించేలా చేస్తున్నాయి.
సిబ్బంది శిక్షణ కూడా ఇవ్వకుండా పంపిస్తున్నారు..!
ఇది మాత్రమే కాదు.. ఎన్నికల సంఘం వైపు వేలెత్తి చూపించాల్సిన మరో ప్రశ్న కూడా బలంగానే.. ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి. అదే పోలింగ్ సిబ్బంది సన్నద్ధత. మొత్తంగా ఏడు దశల్లో పోలింగ్ పెట్టారు. సగటున ఒక విడతలో ఎనభై నియోజకవర్గాల్లో మాత్రమే పోలింగ్. అయినా అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. మిషిన్లలో సమస్యలు ఉన్నా లేకపోయినా..వాటిని ఆపరేట్ చేయాల్సిన సిబ్బంది విషయంలో మాత్రం.. అనేక సమస్యలు వస్తున్నట్లు… తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఈవీఎంలను పోలింగ్ కు రెడీ చేయడానికే…పోలింగ్ సిబ్బంది అనేక తంటాలు పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అసలు వాటిని పోలింగ్ కేంద్రంలో ఎలా అమర్చాలి.. ఎలా పోలింగ్ ప్రారంభించాలి.. అన్నదానిపై సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్లే సమస్యలు వచ్చినట్లు గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఏడు విడతలుగా ఎన్నికలు పెడుతున్నప్పటికీ.. కనీసం..సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలోనూ ఈసీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి…
వీవీ ప్యాట్లు లెక్కిస్తేనే నమ్మకం ..!
విపక్షాలు కొంత కాలంగా.. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే వీవీ ప్యాట్లను పెట్టామని.. ఈసీ చెబుతోంది. అయితే.. వాటిని లెక్కించడానికి మాత్రం ససేమిరా అంటోంది. ప్రజాస్వామ్యానికి నమ్మకమే పునాది. ఈవీఎంల ద్వారా… ఆ నమ్మకానికి.. మెల్లగా గండి పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే… కొన్ని అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటూ రాజ్యాంగబద్ధ సంస్థలే వివాదాస్పదం అవుతూంటే… ఇక ఎవరు.. నమ్మకాన్ని పెంచుతారు..? ఈవీఎంలపై పాలకులకు మంకు పట్టు ఎందుకు..? అదే పనిగా సాంకేతిక సమస్యలు వస్తున్నా… ఎందుకు కేర్ చేయడం లేదు..? వీవీ ప్యాట్లు 50 శాతం లెక్కిస్తే.. వచ్చే నష్టం ఏమిటో ఈసీకే తెలియాలి. ఇలా మంకుపట్టు పట్టడం వల్ల.. అసలుకే అనుమానాలొస్తున్న పరిస్థితి ఏర్పడింది.