వివేకా హత్య కేసు నిందితులను కూడా పరిటాల రవి కేసులో నిందితుల్ని చంపినట్లుగా వరుసగా చంపుకుంటూ పోతారని టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొద్దు శీనును జైలులో చంపినప్పుడు ఇంచార్జీగా ఉన్న వరుణారెడ్డి అనే జైలర్‌ను కడప కోర్టుకు పంపడంతో చంద్రబాబుకు ఈ అనుమానం వచ్చింది. వివేకా హత్య కేసులో నిందితులు ప్రస్తుతం కడప జైలులో ఉన్నారని గుర్తు చేశారు. వరుణ్ రెడ్డి నియామకంపై సీబీఐ అధికారులకు లేఖ రాస్తానని చంద్రబాబు ప్రకటించారు.
జగన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి సాయంతో వరుణ్ రెడ్డి ద్వారా వారికి ప్రాణముప్పు పొంచి ఉందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ గతంలో దూకుడుగా విచారణ జరిపింది. కానీ దస్తగిరి అప్రూవర్ గా మారిన తర్వాత వారిపైనే అనేక రకాల ఫిర్యాదులు చేస్తూ కొంత మంది ఎస్పీలను ఆశ్రయించడంతో సీన్ మారిపోయింది. సీబీఐ అధికారులు వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో కొత్తగా ఎలాంటి విచారణలు చేయడం లేదు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిపై కొత్తగా చార్జిషీట్ దాఖలు చేశారు.
కానీ దస్తగిరి వాంగ్మూలంలో ఇచ్చినట్లుగా అవినాష్ రెడ్డిని ఆయన తండ్రిని ప్రశ్నించలేదు. దీనిపై టీడీపీ నేతలు సీబీఐ విచారణ తీరుపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నిందితుల భద్రత అంశాన్ని తెరపైకి తెచ్చారు. వరుణారెడ్డి నియామకంపై ఒక వేళ చంద్రబాబు సీబీఐకి రాస్తే వారు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిరకం. నిజంగానే నిందితుల ప్రాణాలకు ముప్పు ఉందంటే వారిని ఇతర రాష్ట్రాలకు తరలించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు.