తెరాస ప్రభుత్వంలో కెటిఆర్ హరీష్‌ల మధ్య పోటీని అధికారికంగా గుర్తించడం వెనక ఏదైనా వ్యూహం వుందా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్కే ఓపెన్ హార్ట్‌లో హరీశ్ తను కెసిఆర్ కనుసన్నల్లో పనిచేస్తానని ఆయన చెబితే కెటిఆర్ ముఖ్యమంత్రి అయినా అభ్యంతరం లేదని చెప్పేశారు. నిజానికి ఈ దశలోనే ఇంత బండగా చెప్పించాల్సిన అవసరం లేదు గాని అనిపించారు.మరోవైపున కవిత కెటిఆర్‌ల ఉమ్మడి సభలు కూడాజోరుగానే జరుగుతున్నాయి.హరీశ్ తన శైలిలో తన సభలు ప్రసంగాలూ తాను చూసుకుంటున్నారు. ఏది ఏమైనా గతంలో వలె దూకుడుగా గాక కొంచెముండుటెల్ల కొదవగాదన్న తరహాలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు అంతకన్నా ప్రత్యామ్నాయం లేదు కూడా. ఇలాటి నేపథ్యంలో స్వయంగా కెటిఆర్ ఈ సమస్యపై మాట్లాడ్డం హరీశ్ కాంగ్రెస్‌లోకి వెళ్లడం జరగదని చెప్పడం ఆసక్తికరం. పార్టీల్లో అగ్రనాయకులకు సంబంధించి వచ్చే వదంతులను అగ్రస్థాయిలో పట్టించుకోరు. . బాహుబలి వస్తాడన్న వ్యాఖ్యను హరీశ్‌కు కొందరు ఆపాదించి వుండొచ్చు గాని దానికి సమాధానం పేరిట కెటిఆర్ మాత్రం హరీశ్‌ను కాంగ్రెస్‌ను కలిపి ప్రస్తావించడమే విచిత్రం. ఏదో విధంగా బావ మరుదుల మధ్య ప్రచ్చన్న పోటీని, హరీశ్‌పై వదంతుల చర్చను అధికారికం చేయాలని కెసిఆర్ కుటుంబం నిర్ణయించుకున్నదా అని సందేహం కలుగుతుంది. అదే నిజమైతే మాత్రం పెద్ద విషయమే.