అమరావతిలో ఒకవైపు సెక్రటేరియేట్, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల తాత్కాలిక నిర్మాణాలకు పనులు మొదలయ్యాయి. తాత్కాలికం ఎందుకు? శాశ్వత నిర్మాణాలు ఎందుకు ఇంకా మొదలు కావడం లేదు అనే సందేహాలు జనంలో చాలా మందికి కలుగుతున్నాయి. అమరావతి కోర్ కాపిటల్లో నిర్మాణాలు అన్నింటినీ సింగపూర్ కన్సార్టియంకు గంపగుత్తగా అప్పగించి.. ఆర్థిక భారం పెద్దగా లేకుండా నగరాన్ని సాకారం చేయడం గురించి చంద్రబాబు సర్కారు ప్లాన్ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. సింగపూర్ కన్సార్టియం వారు దీనికి సంబంధించి ఇదివరలోనే తమ ప్రతిపాదనలు కూడా ఇచ్చారు. అయితే అమరావతి భూముల విషయంలో తమ హక్కులకు సంబంధించి సింగపూర్ కంపెనీలు గొంతెమ్మ కోరికలతో ఉన్నాయంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అసలు మన భూముల మీద మన ప్రభుత్వానికే హక్కులు ఉండకపోయేలా వారు నిబంధనలు రూపొందించడం వాటిని చంద్రబాబు సర్కారు నిర్ద్వంద్వంగా తిప్పికొట్టడం కూడా జరిగింది.
ఈ భూముల మీద హక్కులకు సంబంధించి రెండు కీలక నిబంధనల విషయంలో సింగపూర్ సంస్థలు ఒక మెట్టు దిగి వచ్చి తాజాగా మళ్లీ కొత్త నిబంధనల్ని ప్రతిపాదించినట్లుగా తెలుస్తున్నది. ఇదివరలో 25 కిలోమీటర్ల వ్యాసార్థంలో తాము నెలకొల్పే సంస్థ తరహాలో మరో సంస్థకు అనుమతి ఇవ్వరాదన్నది ఒక నిబంధన కాగా, భూమి కేటాయింపుల మీద పూర్తి హక్కులు సింగపూర్ సంస్థకే ఉండాలనే విషయంలో కూడా వారు వెనక్కు తగ్గినట్లు తెలుస్తున్నది. ఈ కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం సమాన భాగస్వామ్యంతో కూడిన సంస్థే భూ కేటాయింపులు చేసేలా కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రాంతాల వారీగా భూమికి కనీస ధరలను వారు నిర్ణయిస్తారు.
ఇప్పటిదాకా పనులు మొదలు కావడం లేదు గనుక.. ఈ వ్యవహారంపై జనంలో ఇప్పటికే రకరకాల సందేహాలు రేగుతూ ఉన్నాయి గనుక.. ఏదో ఫ్రస్ట్రేషన్లో పడినట్లుగా ఈ నిబంధనలను యథాతథంగా ఆమోదించేస్తే ప్రమాదం తప్పదేమో అని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ సింగపూర్ కంపెనీలు ప్రతిపాదించిన నిబంధనలు ప్రమాదకరంగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా ఏ వ్యాపార సంస్థ తమ వాటాలను అమ్మినా సరే.. నిర్ణయాధికారం తమ చేతినుంచి జారిపోకుండా ఉండేలా.. సగానికంటె ఎక్కువ వాటా తమ చేతిలోనే ఉండేలాగా మాత్రమే చేస్తుంటుంది. అలాంటిది రాష్ట్రప్రభుత్వంతో ‘సమానంగా’ సింగపూర్ సంస్థ కూడా భూకేటాయింపుల హక్కులు కలిగి ఉండడం అనేది ప్రమాదకర నిబంధన అని పలువురు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేటాయింపు సంస్థలో మెజారిటీ వాటా ఉండాలని… అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వ ఇష్టానుసారం నిర్ణయం జరిగేలాగా ఉండాలనేది నిపుణుల సూచనగా ఉంది.
మరి చంద్రబాబు సర్కారు నిబంధనల విషయంలో సింగపూర్ కన్సార్టియం మెడలు వంచి, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రభుత్వాల హక్కులు నాశనం అయిపోకుండా వారిని కిందికి తీసుకువస్తుందో? లేదా, అచ్చంగా.. అమరావతి భూములను ధారాదత్తం చేసేస్తుందో వేచిచూడాలి.