చిత్తూరు దళిత మహిళా డాక్టర్ అనితా రాణి ఆరోపణపై సీఐడీ దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తనను వైసీపీ నేతలు వేధించారని.. అనితారాణి హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని..ఆమె అంటున్నారు. అనితా రాణి ఆరోపణలపై మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో సీఐడీ దర్యాప్తు చేయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే అనితా రాణి మాత్రం.. ఏపీ సర్కార్ అధీనంలో ఉండే..సీఐడీ మీద తనకు నమ్మకం లేదని సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టులోనూ తాను సీబీఐ విచారణ కోరుతానన్నారు. వైసీపీ నేతలే వేధించారని ఆమె ఆరోపిస్తున్నారు కాబట్టి… పోలీసులు న్యాయం చేయరని ఆమె భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు నెలలైంది. స్పందించలేదనే హైకోర్టులో కేసు వేశానని చెబుతున్నారు.
డాక్టర్ అనితారాణి.. మూడు నెలలుగా న్యాయం కోసం పోరాడుతున్నారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్‌గా పని చేస్తున్న అనితారాణి.. ఆసుపత్రిలో దిగువస్థాయి సిబ్బంది అవినీతిని ప్రశ్నించినందుకు కక్షగట్టారని ఆరోపిస్తున్నారు. జనతా కర్ఫ్యూ రోజున తనను హాస్టల్‌ని నిర్బంధఇంచారని.. స్థానిక వైసీపీ నేతలను పిలిచించి.. అభ్యంతరకరంగా ప్రవర్తించారని అనితారాణి ఆరోపిస్తున్నారు. జరిగిన పరిణామాలను పోలీసులకు వీడియోతో సహా ఫిర్యాదు చేసినా తననే పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టారన్నారు. ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో వారం కిందట హైకోర్టును ఆశ్రయించినట్లుగా అనితారాణి చెబుతున్నారు.
ఇప్పటికే ఏపీలో దళిత డాక్టర్ సుధాకర్ వ్యవహారం కలకలం రేపుతోంది. మాస్కులు అడిగిన ఆయనపై మానసికరోగిగా ముద్ర వేసేందుకు ప్రయత్నించారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో.. మరో దళిత వర్గానికి చెందిన మహిళా డాక్టర్‌ను వేధింపులకు గురి చేయడం..రాజకీయంగానూ కలకలం రేపుతోంది. ఈ అంశం మరింత పెద్దది కాకుండా ఉండాలని జగన్..సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లుగా భావిస్తున్నారు.