హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకురాలు పురందేశ్వరి ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కాల్‌మనీ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుణాల పేరుతో మహిళలను లైంగికంగా వేధించటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులపై నిర్భయ కేసు పెట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని అన్నారు.
నిర్భయ కేసులో బాలనేరస్థుడి విడుదల గురించి మాట్లాడుతూ, అతడిని జైలునుంచి విడుదల చేయొద్దని పురందేశ్వరి డిమాండ్ చేశారు. అతడిని విడుదల చేస్తే సమాజంలోకి మృగాన్ని వదిలినట్లేనని వ్యాఖ్యానించారు. మరోవైపు నిర్భయ తల్లిదండ్రులు బాలనేరస్థుడిని విడుదల చేయకూడదని కోరుతూ ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్వద్ద ఆందోళన నిర్వహించారు. విడుదలను ఆపాలని కోరుతూ ఢిల్లీ మహిళా సంఘం నిన్న అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించటాన్ని నిర్భయ తల్లి విమర్శించారు. అది పగలే చేసి ఉంటే ఫలితముండేదని, రాత్రిపూట వెళ్ళటం వలన ప్రయోజనం నెరవేరలేదని అన్నారు. సుప్రీంకోర్ట్ సోమవారం కేసును విచారణకు తీసుకుంటానందని, అయితే ఆదివారం నేరస్థుడు విడుదలవుతుంటే సోమవారం విచారణకు తీసుకోవటం వలన ఫలితమేముంటుందని ప్రశ్నించారు. ఢిల్లీ మహిళా సంఘం అధ్యక్షురాలు స్వాతి మలీవాల్ జ్యువనైల్ జస్టిస్ బోర్డ్‌కు లేఖ రాస్తూ, బాల నేరస్థుడి విడుదలపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నందున అతడిని విడుదల చేయొద్దని అభ్యర్థించారు. నిర్భయపై జరిగిన అత్యాచారంలో అత్యంత పాశవికంగా, మర్మాంగంలో ఇనుప రాడ్డును చొప్పించి దాడి చేసినది ఈ బాలనేరస్థుడే.