వరంగల్ ఉప ఎన్నికలలో రాజకీయ అతిరధ మహారధులతో తలపడవలసి ఉంటుందని తెలిసి కూడా రాజకీయాలలో ఏమాత్రం అనుభవం లేని, వరంగల్ ప్రజలతో ఏమాత్రం పరిచయాలు లేని, మిగిలిన వారితో పోల్చితే వృద్దుడుగా కనిపిస్తున్న డా. దేవయ్యను బీజేపీ తన అభ్యర్ధిగా బరిలోకి దింపింది. ఎన్నికల ముందు ఆయనను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చి వరంగల్ నుంచి పోటీ చేయిస్తునందుకు పార్టీలో చిరకాలంగా పనిచేస్తూ టికెట్ ఆశించి భంగపడినవారు ఆయన విజయానికి సహకరించకపోవచ్చును. అదేవిధంగా తెదేపాలో సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి వరంగల్ నుంచి పోటీ చేయాలని ఆశించి భంగపడ్డారు. కనుక డా.దేవయ్యకు తెదేపా శ్రేణుల సహాయసహకారాలు, మద్దతు లభ్యం కాకపోవచ్చును.
ఇక దేవయ్యకే ప్రజలు ఎందుకు ఓటేయాలి? అనే ప్రశ్నకు బీజేపీ వద్ద సరయిన సమాధానం లేదు. దేవయ్యకు ఓటేస్తే ఆయనను కేంద్రమంత్రిగా చేసే “అవకాశం” ఉందని రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెపుతున్నారు. ఆయన కేంద్రమంత్రి అయితే తెలంగాణా, వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తారని కిషన్ రెడ్డి చెపుతున్నారు. ఒకవేళ మోడీ మంత్రివర్గ విస్తరణకు పూనుకొన్నట్లయితే అన్ని రాష్ట్రాలలో బీజేపీ నేతలు తమకీ అవకాశం ఇవ్వాలని కోరుతారు. అటువంటప్పుడు ఆయన నిన్నగాక మొన్న కొత్తగా పార్టీలో చేరినవారిని తీసుకొంటారా…లేక చిరకాలం పార్టీకి సేవలు చేస్తున్న మంచి రాజకీయ అనుభవం ఉన్నవారిని తీసుకొంటారా? అని అలోచిస్తే కిషన్ రెడ్డి మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో అర్ధమవుతుంది. ఒకవేళ అవసరమనుకొంటే కిషన్ రెడ్డినే కేంద్రమంత్రిని చేయవచ్చు కదా? కానీ బండారు దత్తాత్రేయను ఎందుకు చేసారు? అని ఆలోచిస్తే లాజిక్ అర్ధమవుతుంది. కనుక డా. దేవయ్యను గెలిపిస్తే కేంద్రమంత్రి పదవి ఇచ్చే ప్రసక్తే ఉండదని భావించవచ్చును. ఈ ఎన్నికలలో ఏదోవిధంగా గెలిచేందుకే కిషన్ రెడ్డి ఆవిధంగా చెపుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుంది.
దేవయ్య గతంలో తెలంగాణా ఉద్యమంలో కూడా పాల్గొన్నారని, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీలో కిషన్ రెడ్డితో సహా చాలా మంది తెలంగాణా సాధన కోసం అలుపెరుగని పోరాటాలు చేసారు. ఒకవేళ ఎన్నికలలో పోటీ చేయడానికి అదే అర్హత అయినట్లయితే బీజేపీలోనే చాలా మంది అర్హులున్నారు. లోక్ సభ ఎన్నికలంటేనే కోట్లు రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. బీజేపీలో అంత ఆర్దికశక్తి గల వ్యక్తి లేనందునే అమెరికాలో వైద్యుడిగా స్థిరపడిన డా. దేవయ్యను పార్టీలోకి తీసుకువచ్చి పోటీ చేయిస్తున్నారు. అయితే ఇటువంటి ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధి ఆర్దికశక్తి ఒక్కటే పరిగణనలోకి తీసుకోవడమే పెద్ద పొరపాటు.
తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్ ఆర్ధికంగా బలమయిన వారు కాదు. కానీ తెలంగాణా ఉద్యమాలలో కేసీఆర్ కలిసి పోరాడిన అనుభవం ఉంది. తెరాసలో నేతగా మంచి రాజకీయ అనుభవం ఉంది. స్థానిక ప్రజలు, నేతలతో మంచి సత్సంబదాలున్నాయి. పైగా యువకుడు, చాలా చురుకయిన వాడు. అందుకే ఆయన ఎన్నికల ఖర్చును తెరాస పార్టీయే భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కనుక అభ్యర్ధి ఎంపిక విషయంలో బీజేపీ ఏవిధంగా చేసి ఉండాల్సిందో అర్ధమవుతోంది. అలాగే ఏమి పొరపాటు చేసిందో కూడా అర్ధమవుతోంది. కానీ ఇప్పుడు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు కనుక బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ డా. దేవయ్య విజయానికి కలిసి కట్టుగా చెమటోడ్చవలసిందే.