భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర పరిణామాలను చూపించి టీార్ఎస్తో మైండ్ గేమ్ ఆడుతోంది. సందర్భం వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ను చీల్చబోతున్నట్లుగా నేరుగా చెబుతున్నారు. తాాజాగా తెలంగాణకు చెందిన లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.ఈ రోజు పదవి ప్రమాణం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్లో తమ కట్టప్పులు ఉన్నారని వారంతా ప్రభుత్వానికి కూల్చడానికి రెడీ అయ్యారని ప్రకటించేశారు.
బీజేపీ మిషన్ దక్షిన్ పేరుతో ప్రత్యేక దృష్టి పెట్టారని, పెద్దోళ్ల కన్నా పేదోళ్లకే బీజేపీకి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నిక లాంఛనమే అన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థి గెలుపును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను దోచుకున్నది చాలదని జాతీయ రాజకీయాల్లోకి వస్తారని అంటున్నారని విమర్శించారు. కేసీఆర్ జాతీయ పార్టీ పగటి కల అన్నారు.
తరచూ టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల గురించి బీజేపీ నేతలు మాట్లాడుతూండటం … మహారాష్ట్ర తరహా పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఉండటం టీఆర్ఎస్ వర్గాల్లోనూ కలకలంరేపుతోంది. టీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి ఉంది . అయితే అది మహారాష్ట్ర స్థాయిలో ఉందని ఎవరూ అనుకోవడం లేదు. ఇక్కడ ఏక్నాథ్ షిండే లాంటి నేత ఉన్నారని కూడా భావించడం లేదు. అందుకే బీజేపీ మైండ్ గేమ్ మాత్రమే ఆడుతోందని టీఆర్ఎస్ వర్గాలు అంచనాకు వస్తున్నాయి.