‘రౌతును బట్టే గుర్రం నడక’ అని పెద్దలు ఊరికే అనలేదు. అది తెలంగాణా భాజపా విషయంలో మరోసారి నిరూపితమయింది. ఇంతవరకు తెలంగాణా భాజపా అధ్యక్షునిగా కొనసాగిన కిషన్ రెడ్డికి తమ పార్టీ తెదేపాతో పొత్తులు పెట్టుకోవడం మొదటి నుంచి కూడా ఇష్టం లేదు. అధ్యక్షుడిగా ఇటీవల ఆయన నిర్వహించిన చిట్ట చివరి సమావేశంలో కూడా ఆయన తన వైఖరిని మరోమారు పార్టీ పరంగా పునరుద్ఘాటించారు. తెదేపా పట్ల ఆయనకున్న ఆ వ్యతిరేకత కారణంగానే రెండేళ్ళు గడుస్తున్నా తెలంగాణాలో ఆ రెండు పార్టీల మధ్య ఆశించినంత సఖ్యత ఏర్పడలేదు తత్ఫలితంగా రెండూ కూడా చాలా తీవ్రంగా నష్టపోయాయి.
ఆయన స్థానంలో కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికయిన భాజపా శాసనసభా పక్ష నేత డా. కె.లక్ష్మణ్, నిన్న పార్టీ బాధ్యతలు చేపట్టగానే అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడటం విశేషం. ఇది ఎన్నికల సమయమేమీ కాదు కనుక ప్రస్తుతం పొత్తుల గురించి మాట్లాడుకోవడం అనవసరం అని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడటమే తన ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. పార్టీలో అందరినీ కలుపుకొని వెళుతూ తెలంగాణా రాష్ర్టంలో భాజపాని బలోపేతం చేసేందుకు గట్టిగా కృషి చేస్తానని చెప్పారు.
తెదేపాతో యదాప్రకారం పొత్తులు కొనసాగిస్తామని ఆయన గట్టిగా నొక్కి చెప్పనప్పటికీ, అదే సమయంలో కిషన్ రెడ్డిలాగ తెదేపాను వ్యతిరేకిస్తున్నట్లుగా మాట్లాడలేదు. ప్రస్తుతం పొత్తుల గురించి మాట్లాడుకోవలసిన సమయం కాదని వాస్తవిక దృష్టితో మాట్లాడారు. అంటే దానర్ధం ఆయన తెదేపాకు అనుకూలంగా ఉన్నట్లు కూడా కాదు. కానీ అప్రస్తుతమయిన ఆ అంశం గురించి మాట్లాడి రచ్చ చేసుకోవడం వలన రెండు పార్టీలకి ఇంకా నష్టామే తప్ప ఏమాత్రం లాభం ఉండదనే ఉద్దేశ్యంతోనే అయన దానిని ‘అప్రస్తుత అంశం’ గా ప్రకటించేశారు. అది చాలా మంచి నిర్ణయమనే చెప్పవచ్చును.
ఇటీవల కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు తెలంగాణాలో తెదేపాతో పొత్తుల తెగతెంపులు చేసుకోబోతున్నట్లు మాట్లాడిన తరువాత, ఆ ప్రభావం ఆంధ్రాలో తెదేపా-బీజేపీ కూటమిపై కూడా స్పష్టంగా కనబడింది. రెండు పార్టీలకి చెందిన నేతలు పరస్పరం ఘాటుగా విమర్శలు చేసుకోవడం అందరూ చూసారు. కనుక అప్రస్తుతమయిన ఆ అంశం గురించి ఇప్పటి నుంచే కీచులాడుకొని నష్టపోవడం కంటే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీని బలోపేతం చేసుకోవడమే మంచి ఆలోచన అని చెప్పవచ్చును.
ప్రస్తుతం మిత్రపక్షంగా ఉన్న తెదేపాతో చెట్టపట్టాలు వేసుకొని ముందుకు సాగాకపోయినా కనీసం దానితో ఘర్షణ పడకుండా ఉన్నట్లయితే, ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి తెదేపాతోనే కలిసి కొనసాగాలని భాజపా అధిష్టానం నిర్ణయించుకొంటే, దానితో కలిసి పనిచేసేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ తెదేపాతో తెగతెంపులు చేసుకోవాలని అధిష్టానం నిర్ణయించుకొంటే అదేమీ పెద్ద పని కాదు.
ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి కూడా డా. లక్ష్మణ్ చూపిన వైఖరినే అవలంభిస్తే మంచిది. అలా కాక తెదేపాను గట్టిగా విమర్శించడం, వ్యతిరేకించడం ద్వారానే రాష్ట్రంలో భాజపాని బలోపేతం చేసుకోవచ్చని భావిస్తే, దాని వలన ఆ పార్టీకి ఊహించని నష్టం కలుగవచ్చును. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపాకున్న బలం, ప్రజాధారణ భాజపాకి లేవు కనుక. ఆంద్రాలో నిలద్రొక్కుకొనేందుకు అది తెదేపాపై ఆధారపడి ఉన్నప్పుడు, ఉన్న ఆ ఒక్క ఆధారాన్ని ఉపయోగించుకోకుండా స్వంతంగా ప్రయాణం సాగించాలనుకొంటే భాజపాకి ఎదురీత, కష్టాలు తప్పకపోవచ్చును.
తెదేపాతో పొత్తుల విషయంలో భాజపా అధిష్టానం కూడా కొంచెం అయోమయంలో ఉంది కనుకనే మిగిలిన ఇదు రాష్ట్రాలతో బాటు ఆంధ్రాకి పార్టీ అధ్యక్షుడుని నియమించలేదని భావించవచ్చును. అటువంటప్పుడు రాష్ట్ర నేతలు తెదేపాని వ్యతిరేకించితే ఏమవుతుంది? ఆలోచించుకొంటే మంచిది.