తెలంగాణా భాజపా అధ్యక్షుడిగా నియమితులైన డా. లక్ష్మణ్ తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. “తెరాస ప్రభుత్వం ఫిరాయింపులని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోంది. ఇటువంటి పద్దతులలో కొంత కాలం మాత్రమే అధికారం నిలబెట్టుకోవచ్చు తప్ప శాశ్వితంగా సాధ్యం కాదని గ్రహిస్తే మంచిది. ప్రజలు దానికి అధికారం కట్టబెట్టినప్పుడు చక్కగా పరిపాలన సాగించి, రాష్ట్రాభివృద్ధి చేస్తే ప్రజలే దానిని మెచ్చుకొని మళ్ళీ అధికారం కట్టబెట్టవచ్చు కానీ ఈవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి శాశ్వితంగా అధికారంలో కొనసాగాలనుకొంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఎన్నటికీ సాధ్యం కాదు. ప్రస్తుతం శాసనసభలో తెరాసకి బలం ఎక్కువ ఉంది కనుక అది ఏమి చేసినా ఏమి మాట్లాడినా చెల్లుతోంది. కానీ దాని ధోరణిని ప్రజలందరూ నిశితంగా గమనిస్తూనే ఉన్నారని గుర్తుంచుకోవాలి. వారిని కూడా పట్టించుకోకుండా ఇదే విధంగా వ్యవహరిస్తే దానికి ప్రజలే తగిన బుద్ధి చెపుతారు,” అని అన్నారు.
డా. లక్ష్మణ్ తెరాసను ఉద్దేశ్యించి అన్న మాటలను మోడీ ప్రభుత్వానికి కూడా వర్తింపజేయవచ్చు. మోడీ ప్రభుత్వం కూడా దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి వేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపాకి మిత్రపక్షంగా ఉన్న తెదేపా కూడా తెరాస అడుగుజాడలలోనే నడుస్తూ వైకాపాని తుడిచిపెడుతోంది అయినా భాజపా నేతలెవరూ దానిని తప్పు అని ఖండించలేదు. కనీసం ఆ ఊసు ఎత్తడానికి కూడా వారు ఇష్టపడటం లేదు. ఈ నేపధ్యంలో డా. లక్ష్మణ్ తెరాసకు సుద్దులు చెప్పడం విడ్డూరంగానే ఉంది. భాజపాకో నీతి ఇతర పార్టీలకి వేరే నీతి అన్నట్లున్నాయి ఆయన మాటలు.