“వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ స్థానాలు గణనీయంగా పెరుగబోతున్నాయి కనుక ఇతర పార్టీల నుంచి ఎంత మంది వచ్చి మన పార్టీలో చేరినా పార్టీలో ఉన్నవారు భయాందోళనలు చెందనవసరం లేదు. శాసనసభ స్థానాలు పెరుగబోతున్నాయి కనుక ఎవరికీ అన్యాయం జరుగదు. వచ్చే ఎన్నికలలో అందరికీ టికెట్స్ లభిస్తాయి,” అని తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న తెదేపా, తెరాస పార్టీలు వల్లె వేస్తున్నాయి.
తెలంగాణా భాజపా నూతన అధ్యక్షుడిగా నియమింపబడిన డా. లక్ష్మణ్ నిన్న డిల్లీలో మీడియా సమావేశంలో ఇదే విషయం ప్రస్తావిస్తూ తెదేపా, తెరాసలను విమర్శించారు. శాసనసభ స్థానాలు పెరుగబోతున్నాయి కనుక ప్రత్యర్ధ పార్టీలలో ఫిరాయింపులు ప్రోత్సహించడం అనైతికం, ప్రజాస్వామ్య విరుద్దమని విమర్శించారు. ప్రజలు ఆ రెండు పార్టీలకు స్పష్టమయిన మెజారిటీ ఇచ్చి అధికారం కట్టబెట్టినప్పటికీ, రాష్ట్రాలలో అసలు ప్రతిపక్షాలే ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఈవిధంగా ప్రతిపక్షాలను బలహీనపరచడం, ఫిరాయించినవారికి మంత్రి పదవులు ఇవ్వడం సరికాదని డా. లక్ష్మణ్ అన్నారు. శాసనసభ స్థానాల పెంపు అనేది పాలనా సౌలభ్యం కోసమే తప్ప ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి కాదని అన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక పనులకు పాల్పడటం తెదేపా, తెరాసలకు తగదని హితవు పలికారు.
డా. లక్ష్మణ్ చెప్పిన హితోక్తులు నూటికి నూరు శాతం నిజమని తెదేపా, తెరాసలు కూడా అంగీకరించవచ్చు కానీ వాటిని చెవికెక్కించుకొనే పరిస్థితిలో లేవు. తమ అధికారాన్ని శాస్వితం చేసుకోవాలంటే రాష్ట్రాలలో ప్రతిపక్షాలు లేకుండా చేయడమే అందుకు సరయిన మార్గమని అవి దృడంగా నమ్ముతున్నాయి. వాటి భయానికి కారణం వాటిలో నెలకొన్న అభద్రతా భావమే. ఈ ఐదేళ్ళ పాలనను మెచ్చి ప్రజలు మళ్ళీ తమకే అధికార కట్టబెట్టరేమోననే అనుమానం వాటిలో ఉండబట్టే ఈ అకృత్యానికి ఒడిగడుతున్నాయని చెప్పవచ్చు.
అదీగాక ఆ రెండు పార్టీల అధినేతలు తమ వారసుల రాజకీయ జీవితం సజావుగా సాగడానికి ప్రతిపక్షాలు అడ్డం కారాదని భావిస్తున్నట్లున్నారు.
అధికార కాంక్షతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కూడా వెనుకాడని ఆ రెండు పార్టీలకు బుద్ధి రావాలంటే అందుకు శాసనసభ స్థానాలు పెంచకుండా ఊరుకోవడమే సరయిన విధానం. అలాగా చేసినట్లయితే, ఇప్పుడు ఏ వంకతో ఆ రెండు పార్టీలు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్నాయో, వచ్చే ఎన్నికలలో సరిగ్గా అదే కారణంగా ఆ రెండు పార్టీలు లెంపలు వేసుకొనే పరిస్థితి కల్పించినట్లవుతుంది. సాంకేతిక కారణాల దృష్ట్యా వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ స్థానాలు పెరిగే అవకాశం లేదని సమాచారం.