అబద్దం చెప్పినా అతికినట్లు ఉండాలంటారు..! కానీ విశాఖ మెంటల్ ఆస్పత్రి వైద్యులు మాత్రం.. అతికినా.. అతకకపోయినా.. తాము చెప్పాలనుకున్నది చెప్పేశారు. అదేమిటంటే.. నర్సీపట్నం వైద్యుడు సుధాకర్.. తనంతట తానుగా వచ్చి ఆస్పత్రిలో చేరారట. తనకు మానసిక సమస్యలు ఉన్నాయని కుటుంబసభ్యులను తీసుకు వచ్చి.. పరీక్షలు చేయించుకుని ఆయన అక్కడ చేరిపోయారట. అక్కడ మానసిక వైద్యం అందించే డాక్టర్లు.. చికిత్స చేశారట. హైకోర్టు ఆదేశాలతో సుధాకర్ డిశ్చార్జ్ అయిన తర్వాత మానసిక వైద్య శాల డాక్టర్లు మీడియాకు ఈ వివరాలు పంపారు. డాక్టర్ల ప్రకటన చూసి.. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాల్ని ఫాలో అవుతున్న వారికి కళ్లు బైర్లు కమ్మేశాయి.
రెండు వారాల కిందట.. డాక్టర్ సుధాకర్‌తో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమయింది. ఆయన మద్యం మత్తులో ఉన్నారని చెప్పి.. న్యూసెన్స్ చేస్తున్నారని అదుపులోకి తీసుకుని మొదట.. కేజీహెచ్‌కు.. ఆ తర్వాత వెంటనే మెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆయనకు ” ఎక్యూట్ అండ్ ట్రాన్సియాంట్ సైకోసిస్” అనే మానసిక వ్యాధి ఉందని.. ఓ తెల్ల కాగితంపై డాక్టర్ సర్టిఫై చేసిన పేపర్ సాయంతో.. ఆయనను మెంటల్ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కాపలా ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేశారో లేదో చెప్పకుండానే.. కుటుంబసభ్యులను కూడా కలవనీయలేదు. చివరికి ఈ వ్యవహారం రకరకాల మలుపులు తరిగి చివరికి హైకోర్టుకు చేరడంతో.. అటు పోలీసులు.. ఇటు ఆస్పత్రి వర్గాలు.. కొత్త వాదన ప్రారంభించారు.
అసలు సుధాకర్‌ను తాము అరెస్ట్ చేయలేదనే వాదనను పోలీసులు చెప్పడం ప్రారంభించారు. సుధాకర్ జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారా..? పోలీసు కస్టడీలో ఉన్నారా..? చెప్పాలని నేరుగా హైకోర్టు ప్రభుత్వ లాయర్‌ను ప్రశ్నిస్తే చెప్పలేకపోయారు. ఇప్పుడు తాము అరెస్ట్ చేయలేదనే వాదన వినిపిస్తున్నారు. సుధాకర్‌కు మానసిక రోగం ఉందని చెప్పి.. మెంటల్ ఆస్పత్రిలో చేర్పించేసిన వైద్యులు.. పోలీసులు ఇప్పుడు సీబీఐ విచారణ భయం ఎదుర్కొంటున్నారు. అందుకే.. తాము చేర్పించలేదని.. ఆయనే వచ్చి చేరారనే కథను చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సుధాకర్ వ్యవహారంలో కళ్ల ముందు జరిగిన దానికి భిన్నంగా కొత్త కథ చెప్పడానికి.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరూ ఫ్లాట్‌ఫామ్ రెడీ చేసుకుటున్నారని.. తాజా ప్రకటనలతో తేలిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.