హైదరాబాద్లో రెండు గంటలు వర్షాలు పడితే.. రోడ్లన్నీ పొంగి పొర్లుతాయి. ఆ నీరంతా నాలాల ద్వారా బయటకు పోవాలంటే.. కనీసం రెండు గంటలు పడుతుంది. ఆ రెండు గంటల సమయంలో.. ఆ నీటితో పాటు మనుషులూ కొట్టుకుపోతున్నారు. వారం వ్యవధిలో ఇలా ఇద్దరు నాలాలకు బలయ్యారు. అందులో ఓ చిన్నరి ఉంది. మరో యువకుడు ఉన్నారు. ఈ రెండు ఘటనలు హైదరాబాద్లో మౌలిక సదుపాయాల అంశాన్ని మరోసారి చర్చకు పెట్టాయి. అనూహ్యంగా నేరెడ్మెంట్లో నాలాకు బలైన చిన్నారి సుమేధ తల్లిదండ్రులు.. తమ పాప మృతికి మంత్రి కేటీఆర్ తో పాటు… అధికారులు, ప్రజాప్రతినిధులు కారణం అని ఫిర్యాదు చేయడంతో మరింత కలకలం ప్రారంభమయింది.
హైదరాబాద్ మొత్తం ఓపెన్ నాలాలు ఉంటాయి. వర్షాలు వస్తే నాలాలు, రోడ్లు కలిసిపోతాయి. ఎవరు ఎందులో పడతారో తెలియని పరిస్థితి. ప్రతీ ఏడాది వర్షాకాలంలో నాలాలకు ఒకరో ఇద్దరో బలవ్వకుండా ఉండరు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా.. అధికారులు హడావుడి చేస్తారు. నాలాను మ్యాపింగ్ చేస్తామని.. మూసేస్తామని.. మళ్లీ జరగకుండా చేస్తామని చెబుతూ ఉంటారు. కానీ మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి. ఆ నల్లాలను మూసేయడమే జరగదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారాలనుకున్న సుమేథ తల్లిదండ్రులు… మరొకరు బలి కాకుండా.. ధైర్యంగా ముందడుగు వేశారు. కేటీఆర్, మేయర్, కమిషనర్, కార్పొరేటర్లందరిపై ఫిర్యాదు చేశారు. నిజానికి ఇప్పటికే.. కింది స్థాయి అధికారులపై ఇప్పటికే పోలీసులు కేసు పెట్టారు.
సుమేధ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో రాజకీయ దుమారం రేగడం ఖాయం. అయితే.. సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందన్న అభిప్రాయం మాత్రం ఏర్పడుతోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందు కేటీఆర్ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. రెండు ప్రాణాలు పోయిన తర్వాత ఆయన మరింతగా ఈ అంశంపై దృష్టి పెట్టారు. ఓపెన్ నాలాను గుర్తించి తక్షణం మూయించే అంశంపై సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇవి సమావేశాలకే పరిమితం కాకుండా మరో ప్రాణం బలి కాకుండా చూస్తేనే.. మున్సిపల్ మంత్రిగా ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుంది. ఎలా చూసినా ఈ వానా కాలం.. . గ్రేటర్ ఎన్నికలకు ముందు కేటీఆర్కు కొత్త టెన్షన్లు తీసుకొచ్చినట్లే అయింది.