దక్షిణాది రాష్ట్రాలకు కొత్త సిటీలు నిర్మించడం అనేది కొత్త టాస్క్ గా మారిపోయింది. రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబునాయుడు అమరావతి నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. అది జగన్ నిర్వాకం వల్ల ఐదేళ్లు ఆలస్యం అయింది. ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక్క అమరావతి ఏంటి.. తాము కూడా నిర్మిస్తామని ఇతర రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి.
తమిళనాడులో గ్లోబల్ సిటీ
తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్లో గ్లోబల్ సిటీని ప్రతిపాదించింది. చెన్నైకు సమీపంలో రెండు వేల ఎకరాల్లో మొదటి దశలో దీన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఓ అత్యాధునిక నగరంగా ..దీన్ని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైనే అతిపెద్ద నగరం ఇప్పుడు .. మరో నగరం ఎందుకన్న డౌట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఇదో కొత్త పాలసీ గా మారింది.
కర్ణాటకలో క్విన్ సిటీ
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొద్ది రోజుల కిందట KWIN పేరుతో కొత్త సిటీని బెంగళూరుకు కాస్త దూరంగా… నిర్మిస్తున్నారు. అటు ఎయిర్ పోర్టు.. ఇటు బెంగళూరుకు సమదూరంలో… దొడ్డబళ్లాపూర్ వద్ద ఈ సిటీకీ శంకుస్థాపన చేశారు. నాలెడ్జ్, హెల్త్, ఇన్నోవేషన్, రీసెర్చ్ కు కేంద్రంగా ఉండేలా ఈ సిటీ నిర్మిస్తామని అంటున్నారు.
తెలంగాణలో ఫోర్త్ సిటీ
తెలంగాణ సీఎం రేవంత్ కూడా ఫోర్త్ సిటీ కోసం ఇప్పటికే ప్లాన్లు రెడీ చేసుకున్నారు. ముఫ్పై వేల ఎకరాల్లో నిర్మిస్తామని భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్లు పిలుస్తున్నారు. కొన్ని భూకేటాయింపులు చేసి నిర్మాణాలు కూడా ప్రారంభిస్తున్నారు.
దేశంలో జోరుగా కొత్త సిటీ ల నిర్మాణం
దేశంలో ప్రత్యేక నగరాలను నిర్మించాలని ఆరాటపడే ప్రభుత్వాల సంఖ్య పెరిగిపోతోంది. రాజధాని లేని రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అమరావతి అనే ఓ భారీ కల కని దాన్ని నిజం చేసేందుకు పయనం ప్రారంభించిన తర్వాత అనేక రాష్ట్రాలు.. తమ రాష్ట్రంలోనూ ఓ మంచి సిటీ ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాయి. గుజరాత్ లో గిఫ్ట్ సిటీ నిర్మాణం జరుగుతోంది. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు కొత్త సిటీల గురించి ఆలోచిస్తున్నాయి.