నాలుగున్నర లక్షలమందికి తలకు 12 లీటర్ల నీటిని అందజేయడానికి రెండు రైళ్ళు 1200 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రారంభించాయి. మహారాష్ట్రలోని లాతూర్ లో నీళ్ళకోసం హింసాత్మక సంఘటనలు పెరిగిపోతూండటంతో 144 సెక్షన్ విధించారు. తక్షణ సహాయక చర్యగా రాజస్ధాన్ నుంచి నీళ్ళ రైళ్ళు బయలుదేరాయి.
మరట్వాడా ప్రాంతంలోని లాతూరుతో సహా అదేరాష్ట్రంలో బుందేల్ ఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా తీవ్రమైన నీటిఎద్దడిని స్వయంగా పరధానమంత్రి నరేంద్రమోదీ సమీక్షించారు. ఫలితంగానే 54 వేల లీటర్ల చొప్పున పట్టే 50 వ్యాగన్లతో రెండు రైళ్ళు రాజస్ధాన్ నుంచి లాతూరు ప్రయాణమయ్యాయి.
గత కొన్నేళ్లుగా వర్షాలు లేక మరఠ్వాడాలోని జలాశయాలు ఎండిపోయి దుర్భర కరువు పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా చాలామంది రైతులు, పేదలు ఊళ్లు వదలి బతుకు తెరువుకోసం ముంబై చేరుకున్నారు. కూలీ పని చేసుకుంటూ కుటుంబాలను సాకుతున్నారు. మరాఠ్వాడాలో కరువు కారణంగా గత ఏడాది 3 వేల 228 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
లాతూర్తో పాటు పరిసర గ్రామాలకు నీటిని సప్లయ్ చేసే డామ్ పూర్తిగా అడుగంటిపోయింది. దీంతో ఇక బావులు, బోరు బావులే జనానికి దిక్కయ్యాయి. ఆ బావుల నుంచి జనానికి సరిపడా నీళ్లు సప్లయ్ కావడం లేదు. తాగునీరు కూడా లేని దుర్భిక్షం తీవ్రత ఇది.
ప్రభుత్వాలే వ్యవసాయ అభివృద్ధి క్రతువు మొదలు పెట్టాక, ఒక వానఇచ్చిన తేమతోనే విగగకాసిన ఆరుతడి జొన్న ఎన్నినీళ్ళైనా చాలని వరి ముందు ఓడిపోయింది. ప్రాజెక్టుల ముందు చెరువులు మాయమైపోయాయి. బోర్లు వచ్చాక నేలమీద నీరే కనిపించకుండా పోయింది. దాహంతీరని వంగడాలు నేలను పిప్పిగా మార్చేస్తున్నాయి. పురుగుమందులు, రసాయన ఎరువులు భూమిని మందు పాతరగా మార్చేస్తున్నాయి.
ఇన్ని కారకాలను సృష్టించిన ”అభివృద్ధి” వెనుకే భూమిలోంచి ప్రళయం ఉబికి వస్తూంది. అది ఇదే లాతూరులో భూకంపమై మొదటిసారి హెచ్చరించింది. పల్లెను చల్లగా తాకిన వాగునీ, నేలను పచ్చగా వుంచిన పిల్లకాలువనీ, మనిషికీ, పశువుకీ తిండిపెట్టిన చెరువునీ మాయం చేసుకుంటున్న మానవాళికి రెండో హెచ్చరికలా అదే లాతూరులో తాగునీళ్ళే లేకుండా పోయిన శాపం దాపురించింది.