హైదరాబాద్: మోహన్‌లాల్ హీరోగా 2013లో మళయాళంలో విడుదలైన దృశ్యం చిత్రం ఒక అరుదైన ఘనతను దక్కించుకుంది. తెలుగు, కన్నడం, తమిళ్, హిందీ – నాలుగుభాషలలో రీమేక్ చేయబడటంతోబాటు అన్నిచోట్లా హిట్ అయ్యి రికార్డ్ సృష్టించింది. 2013 డిసెంబర్ 19న విడుదలైన ఒరిజినల్ దృశ్యం మళయాళంలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులు తిరగరాసింది. రు.4.5 కోట్లతో తయారైన ఈ థ్రిల్లర్ మొత్తం 66 కోట్లకుపైగా వసూలు చేసింది. కేరళ ప్రభుత్వ ఉత్తమచిత్రం అవార్డుతోబాటు, ఫిల్మ్‌ఫేర్ తదితర అవార్డులుకూడా గెలుచుకుంది. మళయాళంలో రు.50 కోట్లకు పైగా వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం ఇదే.
అలనాటి తమిళనటి శ్రీప్రియ ఈ చిత్రం హక్కులను కొని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్వీయదర్శకత్వంలో నిర్మించింది. వెంకటేష్ సరసన – మళయాళంలో హీరోయిన్గా నటించిన – మీనాయే నటించింది. తెలుగులోకూడా పెద్ద హిట్టే అయ్యింది. తర్వాత కన్నడంలో రవిచంద్రన్ హీరోగా తమిళ దర్శకుడు పి.వాసు దృశ్య పేరుతో నిర్మించగా అక్కడకూడా హిట్ అయికూర్చుంది. తమిళంలో కమలహాసన్, గౌతమి ప్రధాన పాత్రలలో నటించారు. పాపనాశంపేరుతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ఇక గతనెలలో విడుదలైన హిందీ దృశ్యంలో అజయ్ దేవగన్, శ్రియ ప్రధాన పాత్రలలో, పోలీసాఫీసర్ పాత్రలో టబు నటించారు. ఇదికూడా విజయపథంలో నడుస్తోంది.
ఇలా ఐదుభాషలలో ఒక కథ సినిమాగా రూపొందటం, అన్నిచోట్లా విజయం సాధించటం ఇంతకుముందుకూడా ఉన్నప్పటికీ హీరో ఓరియెంటెడ్ కథ కాకుండా ఒక థ్రిల్లర్ ఇంత హిట్ అవ్వటంమాత్రం అరుదేనని చెప్పాలి.